ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు

– ఖమ్మం జిల్లా చైతన్యానికి మారు పేరు
– సమర్థుడనే ఆ శాఖలు శ్రీనన్నకు ఇచ్చాం
– బెండాలపాడులో ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో సీఎం రేవంత్‌

అశ్వారావుపేట, ప్రజాతంత్ర, సెప్టెంర్‌ 3: హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చామని, ఆ మాటను ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరుస్తున్నామని అన్నారు. పేదోడి సొంతింటి కలను నిజం చేయడంకంటే సంతోషం మాకు ఇంకేం ఉంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం అనంతరం దామరచర్లలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పేదరికాన్ని పారదోలడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్‌ కార్డులు ఇచ్చాం.. రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు. మన తలరాతను మార్చేది విద్య ఒక్కటే.. విద్య మాత్రమే మన జీవితాలను బాగుచేస్తుందని రూ.20 వేల కోట్లు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏటీసీ ఏర్పాటు చేసే బాధ్యత నాది.. చదువుకోండి.. చదువుకు ఏం కావాలో నన్ను అడగండి..ఎవరో సాయం చేయాలని ఎదురుచూసే స్థాయి నుంచి ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి.. ఆ స్థాయికి ఎదగాలంటే చదువుకోవాలి అని ప్రజలకు సూచించారు. కీలక శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయంటూ ఈ జిల్లా ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదని, చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది.. పేదోడి సొంతింటి కలను నిజం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

సమర్థుడనే పొంగులేటికి ఆ శాఖలిచ్చా: సీఎం

పేద వాళ్లందరికీ ఇళ్లు వచ్చేలా చేయాలన్నా.. ధరణి భూతం నుంచి రైతుల్ని విముక్తుల్ని చేయాలన్నా సమర్థుడైన మంత్రి కావాలని భావించానని సీఎం చెప్పారు. అందుకే పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖలు కేటాయించానని తెలిపారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు సరిగ్గా పనిచేసే మంత్రి ఉండాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల బాధ్యతను శ్రీనన్నకు ఇచ్చాం.. నా అంచనా తప్పలేదు.. ఆయన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అని కితాబు ఇచ్చారు. ధరణిని బొందపెట్టి భూభారతిని తెచ్చినా.. పేదోడి సొంతింటి కలను నిజం చేసినా ఆయన సమర్థవంతంగా చేశారన్నారు.

దోపిడీ సొమ్ము ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది
లక్ష కోట్లు దోచుకున్నాయన కుటుంబ సభ్యులు ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు.. బావ, బామ్మర్ది, అన్న, చెల్లి.. ఇంటిల్లిపాది ఎవరికి వారు కత్తులు, బల్లాలు తీసుకుని పొడుచుకుంటున్నారు.. ఎంత సంపాదిస్తే ఏం లాభం.. దోపిడీ సొమ్ము వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది అని వ్యాఖ్యానించారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు వాళ్లు వాళ్లు కొట్టుకుని మన పేర్లు తెస్తున్నరు.. తామేదో వాళ్ల వెనక, వీళ్ల వెనక ఉన్నామని అంటున్నారు.. 2023లోనే ఆ కాల నాగును కట్టెతో కొట్టి చంపేశానంటూ ఇప్పుడు దాన్ని మళ్లీ చంపాల్సిన అవసరం నాకుందా అని ప్రశ్నించారు.

పేదలే దేవుళ్లుగా సంక్షేమ పధకాల అమలు : మంత్రి పొంగులేటి

పేదలే దేవుళ్లుగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. బెండాలపాడులో గృహ ప్రవేశాల అనంతరం దామచర్ల బహిరంగసభలో ప్రసంగించారు. వో నాలుగు ఇటుకలు పెట్టి శ్లాబ్‌లు వేసి ఇదే ఇల్లు అని మసిబూసి మారేడుకాయ చేసే విధంగా గాక తమ నేతలు రాహుల్‌ గాంధీ. సిఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు పేదల ఆత్మగౌరవం. భరోసా, భద్రతలను పరిరక్షిస్తూ సంక్షేమ పధకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇండ్లు అత్యధికంగా ఇవ్వాలన్న సిఎం రేవంత్‌రెడ్డి సూచనలతో వెయ్యి ఇండ్లతోపాటు ఐటీడీఏ పరిధిలో ఉన్నందును మరో 2,500 ఇండ్లు అదనంగా మంజూరు చేశామని తెలిపారు. చెంచులు, ఇతర ఉప కులాలకు చెందిన 13వేల మందికి ఇండ్లు మంజూరు చేశామని, పూర్తయిన మేరకు ప్రతి ఇంటికీ ప్రతీ సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రే నేడు గృహ ప్రవేశాలలకు రావడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *