– ఏఐ ఫొటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు
– ఫోర్త్ సిటీ అంటూ తన వారికి భూములు కట్టబెట్టే కుట్ర
– మరో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ అధికారంలోకి రాదు
– నిషేధిత భూముల జాబితాతో బ్లాక్ మెయిల్
– సర్కారుపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల, అన్యాయాల ఫలితంగా మరో 50 సంవత్సరాల దాకా ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఇబ్రహీంపట్నంలో శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి పొంగులేటిలపై విరుచుకుపడ్డారు. ఏఐ చిత్రాలతో ఫ్యూచర్ సిటీ అని కొత్త కుట్రకి రేవంత్ రెడ్డి తెరలేపారన్నారు. ఫ్యూచర్ సిటీ తన కుటుంబ సభ్యుల, తన అనుచరుల భూమి కుంభకోణాల కోసమే అని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేస్తూన్న రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రెండు నెలల పాటు అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని, చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదుర్కొని బలంగా నిలబడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఫార్మా సిటీ పేరుతో రేవంత్ భూముల దందా చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. ఆనాడు ఫార్మా సిటీ భూముల్లో అప్పటి సీఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మిగిలిన మేధావులు పాదయాత్ర చేసి తమకు ఓటు వేస్తే మీ భూములు మీకు తిరిగి అప్పజెపుతాం’ అని హామీ ఇచ్చారని, రెండున్నరేళ్ళ తర్వాత మరో 16 వేల ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని మాట్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వం కోహెడలో 178 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కడతామని అంటే ఇప్పుడు రాచకొండ గుట్టలకో, రామోజీ ఫిలిం సిటీ అవతలకో పోవాలని ప్రభుత్వం చెబుతున్నదన్నారు. ఈ భూమి అమ్ముకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిషేధిత భూముల జాబితాను తగ్గించి భూమి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కోటి ఎకరాలకు పెంచి అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భూముల దందా చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఈ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకొని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్నారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవినీతి, అరాచకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని పార్టీతోనే నిలబడి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న ప్రతి ఒక్క నాయకుడికి, మున్సిపల్ కౌన్సిలర్‌కు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని కేటీఆర్ తెలిపారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రానున్న తమ ప్రభుత్వంలో వారందరినీ గుర్తుంచుకొని మరీ తగిన విధంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కోసం పని చేయాలని కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేష్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి కేసీఆర్‌వే
ఈ అరాచక పాలనను అంతమొందించాలంటే కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి.. అసెంబ్లీ ఎన్నికలు కాదు.. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతన్నల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, తాను జగిత్యాలకు వెళితే అక్కడ కలిసిన ఓ రైతు సోదరుడు రేవంత్ మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు.. రూ.27వేల కోట్లు మిగిలినయి. అందులో నుంచి రూ.20 వేల కోట్లు ఇచ్చి రుణ మాఫీ చేసినా అని డబ్బా కొట్టుకుంటు న్నడు.. మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్లి బాకీ ఉన్నడు.. కానీ రుణమాఫీ చేసినా అని చెప్పి అది కూడా ఊరిలో చారానామందికి చేసిండు అని చెప్పిండు.. అగో గట్లుంది పాలన అని ఒక్కమాటలో రైతన్న చెబుతున్నడంటూ ఎద్దేవా చేశారు. ఏ యువకుడినైనా అడగండి రెండు లక్షల ఉద్యోగాలని ఊరించి గద్దెనెక్కి ఈ రెండున్నరేళ్లల్లో 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. మహిళలకు స్కూటీలు, తులం బంగారం అన్నడు.. నెలకు రూ.2500 ఇస్తా అన్నడు.. మాటలతో మహిళలను మోసం చేసిండు. వృద్ధులను కూడా మోసం చేసిండు. 28 నెలల్లో సాధించింది ఏమైనా ఉందంటే దిల్లీకి పోవుడు.. వచ్చుడు తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో 14 వేల ఎకరాలు సేకరించి గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలని పట్టుబట్టామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యమనేది లేకుండా అక్కడే బాగా చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఏడు సంవత్సరాలు కిషన్ రెడ్డి, సబితక్క, తాను కష్టపడి చాలామందిని ఒప్పించి మెప్పించి కొంత ఇబ్బంది పెట్టి కూడా భూములు సేకరించినమని చెప్పారు. అయితే ఇప్పుడేం జరుగుతున్నదో చూస్తున్నామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





