రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారు: మాజీ మంత్రి హరీష్ రావు
ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు..? దసరాకు.. సంక్రాంతికి, ఉగాదికి ఇస్తామని ఊరించి రైతుల్ని ఉసూరుమనిపించారు.
కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని మిగుల్చింది ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వొచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతులను అన్ని కోణాల్లో దగా చేస్తున్నారు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడడం లేదు డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని, ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.





