తమిళనాడు విద్యావిధానం మాకు ప్రేరణ

– తెలంగాణ-తమిళనాడు మధ్య చారిత్రక సంబంధం
– ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించే బాధ్యత తమిళనాడు-తెలంగాణలది
– విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్‌

చెన్నై, సెప్టెంబర్‌ 25: అన్నాదురై, కరుణానిధి, కామరాజ్‌ వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు.. కరుణానిధి విజన్‌ను అమలు చేస్తున్న స్టాలిన్‌, ఉదయనిధిలను అభినందిస్తున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంత మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. కామరాజ్‌ తమిళనాడులో తీసుకొచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమం హృదయాన్ని తాకుతోందని, తెలంగాణలోనూ ఈ స్కీమ్‌ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. నాన్‌ ముదలవన్‌ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) రూ.10 వేల ఉపకార వేతనం ప్రభుత్వ కళాశాలలకు వెళ్లే బాలుర, బాలికలకు ఇచ్చే ఈ స్కీమ్‌లు ఉండడం అదృష్టం.. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్‌ ఉన్నారు.. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకపరమైన బలమైన సంబంధం ఉంది.. 1991 సరళీకృత ఆర్థిక విధానాలతో తమిళనాడులో మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం అభివృద్ధి చెందింది.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాలు అభివృద్ధి చెందాయి.. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు-తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయి.. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం.. మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, 27 శాతం ఎస్సీ, ఎస్టీలకు, మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం.. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది.. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలకు ఆదర్శంగా నిలిచింది.. తెలంగాణలో మా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది.. ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యా శాఖను నా దగ్గరే ఉంచుకున్నా.. మా రాష్ట్రంలో నైపుణ్యత పెంచడానికి యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్శిటీని ప్రారంభించి దానికి చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రను నియమించాం.. కార్పొరేట్‌ సంస్థల అధిపతులను డైరెక్టర్లుగా నియమించాం.. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్శిటీని ప్రారంభించాం. ఇక్కడ అనేకమంది క్రికెట్‌, టెన్నిస్‌, ఇతర క్రీడాకారులు ఉన్నారు.. మనకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నా ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్‌ మెడల్‌ రాలేదు. 4-5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్‌ మెడల్స్‌ వచ్చాయి.. 30 ఎకరాలు ఉన్న దక్షిణ కొరియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వాళ్లకే 16 గోల్డ్‌ మెడల్స్‌ దక్కాయి.. ఒక క్రీడాకారిణికే మూడు అర్చరీ గోల్డ్‌ మెడల్స్‌ వచ్చాయి.. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో మనం ఎక్కడ ఉన్నాం.. ఒక్క గోల్డ్‌ మెడల్‌ లేదు.. అందుకే మేము యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రారంభించాం.. అందులో సంజయ్‌ గోయెంకా, అభినవ్‌ బింద్రా, కపిల్‌ దేవ్‌, ఉపాసన కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్‌ వాళ్లను తీసుకున్నాం.. దీంతోపాటు స్పోర్ట్స్‌ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం.. తమిళనాడు-తెలంగాణ మధ్య సాంస్కృతిక, స్నేహ సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నా.. తమిళ విద్యార్థులు, కోచ్‌లకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తాం.. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్స్‌ సాధించే బాధ్యత తెలంగాణ-తమిళనాడు తీసుకుంటాయి.. గతంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవి. మేం వారంతా వేర్వరని అనుకోవడం లేదు.. వంద నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం.. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్పటికీ అదే సిలబస్‌ కొనసాగిస్తున్నారు.. అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించడం లేదు.. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఐటీఐలను అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.. ఇటీవలే నూతన విద్యా విధానం తీసుకొచ్చాం.. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నాం.. తమిళనాడులాగే తెలంగాణలో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి.. తమిళనాడు, తెలంగాణ దేశానికి రోడ్‌మ్యాప్‌ ఇవ్వనున్నాయి.. నాలెడ్జ్‌ హబ్‌ కానున్నాయి.. తమిళనాడు మాదిరే తెలంగాణ కూడా విద్యపై చేసే వ్యయాన్ని భవిష్యత్‌ తరాలపై పెట్టుబడిగా భావిస్తుంది.. విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నాం.. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు స్టాలిన్‌కు, తమిళనాడు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యను విప్లవంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి స్టాలిన్‌ జ్ఞాపిక బహూకరించగా ఆయనను రేవంత్‌ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *