– జర్నలిస్టుల అరెస్టు పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని, అలాగే వారి ‘ఇందిరమ్మ రాజ్యం’ ఎంత భయంకరంగా ఉందో బయటపెడుతోందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తన విమర్శకులను జైలుకు పంపినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వం ఇంకా మారలేదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ భయభ్రాంతులకు గురిచేయడం, సెన్సార్ విధించడం, బెదిరింపులకు పాల్పడటం ద్వారా విభిన్న స్వరాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేక వార్తా చానళ్లపై నిషేధాలు విధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అధికార ధోరణిని మరింత ముందుకు తీసుకెళ్లి మీడియాపై ముఖ్యంగా తమ విమర్శకుల అరెస్టుల పరంపరను ప్రారంభించిందన్నారు. పత్రికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివని, తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఈ అరెస్టులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మీడియా పక్షాన బీజేపీ అండగా నిలుస్తుందని, పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని రామచందర్ రావు స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





