– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర
– పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. కోహెడ పండ్ల మార్కెట్‌ను సోమవారం సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలి.. దళారుల కోసం కాదు.. ఈ వేదిక నుండి సీఎం రేవంత్ రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నా.. లక్షలాదిమంది రైతుల కోసం ఆలోచించండి తప్ప నలుగురైదుగురు దళారుల కోసం కాదు.. అని అన్నారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో ట్రాఫిక్ తగ్గించడానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 200 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను నిర్మించాలని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తాను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నపుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనతో కొట్లాడి రూ.10 కోట్లను ఫ్రూట్ మార్కెట్ కోసం చేసిన భూసేకరణలో భాగంగా ఇక్కడ రైతులకు ఇప్పించారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టాలనుకుని 2020లో జీవో 11 ద్వారా ఈ మార్కెట్‌ను నోటిఫై చేశామని, జీవో 216 ప్రకారం రూ.350 కోట్ల డబ్బులను మార్కెట్ కోసం బ్యాంక్ అకౌంట్‌లో ఉంచామని హరీష్‌రావు వివరించారు. రూ.1,000 కోట్లతో డీపీఆర్ తయారు చేశామని, భవిష్యత్తులో ఇక్కడే ఫ్లవర్ మార్కెట్ రావాలి.. ఫిష్ మార్కెట్ రావాలని తీర్చిదిద్దామని చెప్పారు. వందేళ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌కు రూపకల్పన చేశామన్నారు. డబ్బులు, భూమి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పని ముందుకు తీసుకెళ్లకపోగా దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన ఈ భూమిని అమ్మాలని, టీజీఐఐసీకి ఇచ్చి తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నదని హరీష్‌రావు ఆరోపించారు. రోజూ 25-30 వేల మంది రైతులకు ఉపయోగపడేది ముఖ్యమా.. లేక నలుగురైదుగురు వ్యాపారులు ముఖ్యమా అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తాం అంటున్నారు. ఆ దిల్ భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంది. ఎస్సీ రైతులు పంట పండిస్తున్నారు. అలాంటి భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఎలా నమ్మాలి అని హరీష్‌రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి భూముల మీద కన్ను పడింది.. ఎక్కడ భూములు ఉన్నా వాటిని అమ్మేయడమే పనిగా పెట్టుకున్నాడని ఘాటుగా విమర్శించారు. నీ కమీషన్ల కోసం రైతుల భూములు కూడా వదిలిపెట్టవా రేవంత్ రెడ్డీ అని నిలదీశారు. కబ్జాలకు కాదేదీ అనర్హం అన్నట్లు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ మార్కెట్ భూములపై కన్ను పడింది.. కూరగాయలు, పండ్లు పండించే రైతుల కోసం ఉన్న మార్కెట్ భూమిని అమ్మేస్తావా.. ఈ మార్కెట్‌ను ఆపే కుట్ర జరుగుతున్నది అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మార్కెట్ వచ్చేదాకా బీఆరఎస్ కోట్లాడుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి ఎకరాల భూమిని నిషేధిత భూముల్లో చేర్చారంటూ ఆ భూముల్లో రైతుల భూములు చేర్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నామని హరీష్‌రావు చెప్పారు. స్వయంగా మీరు రైతు కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడే మార్కెట్‌ను నిర్మించాలి అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





