పాల‌మూరు ప్రాజెక్టును ఎండ‌బెట్టిన రేవంత్‌

– చంద్ర‌బాబుకు కోపం రాకూడ‌ద‌నే ఈ ప‌ని
– కాళేశ్వ‌రం 90% పూర్తిచేసిన నిబద్ధ నాయ‌కుడు కేసీఆర్‌
– డ‌బ్బుల‌ కోస‌మే జీహెచ్ ఎంసీ విభ‌జ‌న‌
– టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు
– ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న లేదు కానీ కేసీఆర్‌తో చ‌ర్చ‌లా?
– మేడిగ‌డ్డ‌ను పేల్చేశారు
– మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకుంటే అది నష్టమే అవుతుందని, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ గుర్తుచేశారు. దాని ఆధారంగానే తమ ప్రభుత్వం మరిన్ని నీటి కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరిందన్నారు. అయినప్పటికీ పాలమూరు ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కావాలనే ఎండబెట్టాడని ఆరోపించారు. శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే తన పాత బాస్ చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా నదినుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ప్రాజెక్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వడం లేదన్నారు. ఏ ప్రభుత్వం అయినా ముందుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తుచేశారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నిబ‌ద్ధ‌ నాయకుడు కేసీఆర్ హయాంలోనే పూర్తయింద‌న్నారు. ఇందులో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందే తప్ప రాజకీయంగా తమకు నష్టం జరగదన్నారు. ప్రజలకు నీళ్లు ఇచ్చింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే కారణంతోనే ఆయన బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనపై వ్యాఖ్యలు చేస్తే తాను స్పందించనని, కానీ తన తండ్రి కేసీఆర్‌పై మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నీళ్ల గురించి ప్రశ్నిస్తే నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ప్రెస్ మీట్‌కే కాంగ్రెస్ నాయకులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కృష్ణా నది ఏ బేసిన్‌లో ఉందో, ఎక్కడ ఉందో కూడా అడిగిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే ఈరోజు నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నారన్నారు. ఇలాంటి వారు నీటిపారుదల శాఖపై చర్చ కోరుతున్నారని, అసలు దేనిపై చర్చ పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. నీటిపారుదలపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ వస్తున్నారన్న మాట వినగానే కాంగ్రెస్ నాయకులు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. కౌశిక్ రెడ్డి సభలో మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. చెక్ డ్యాం పేల్చివేత కేసులో రాఘవ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఉన్నదని, మేడిగడ్డ పేల్చారని ఇంజనీర్లు ఆనాడే ఫిర్యాదు చేశారని చెప్పారు. అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.

విభ‌జ‌న శాస్త్రీయంగా వుండాలి

జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఫోర్త్ సిటీ అని పెట్టిన దానిని కూడా కార్పొరేషన్ చేస్తారేమోనని అన్నారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని, అన్నింటికీ సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చ పెట్టాలని, ఆ చర్చలో తమ పార్టీ అన్ని విషయాలు మాట్లాడుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు చరిత్రాత్మకమని, అటువంటి ఎన్నికలను ఇప్పటివరకు చూడలేదని, మళ్లీ చూడబోమని అన్నారు. కేవలం డబ్బుల సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్లు డిలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా తమ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, గతంలో తాము గెలిచిన సీట్లను భవిష్యత్తులో ఎవ్వరూ గెలవలేరన్న‌ ధీమా వ్యక్తం చేశారు.

ట్యాపింగ్ పేరుతో డైవ‌ర్ష‌న్‌
ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందని, గూఢచారి వ్యవస్థ నెహ్రు కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందని చెప్పారు. శాంతిభద్రతలు, రాష్ట్ర రక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. ఈరోజు నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదని ఎవరైనా అనగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజం కాకపోతే అధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని అడిగారు. ప్రస్తుత డీజీపీ కూడా అప్పట్లో అధికారులుగానే ఉన్నారని, ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించరని, ఉన్న నిబంధనల మేరకు సమాచారం ఎలా వస్తుందో ముఖ్యమంత్రి అడగరని చెప్పారు. ఎస్ఐటీ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లిస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎంతకాలం కాలం వెల్లదీస్తారని అన్నారు. ఇన్ని ఎస్ఐటీలు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా అని అడిగారు. ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. కాంగ్రెస్‌కు పరిపాలన రాదని ప్రజలు తేల్చిచెప్పారని, కాంగ్రెస్ అప్పుల ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదన్నారు. కాగ్ లెక్కలు, నిజాలు కూడా ప్రజలకు తెలుసని, 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు.

ప‌ల‌క‌రిస్తే మంచిదే క‌దా!

కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలని, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదని కేటీఆర్ పేర్కొన్నారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ కానీ పాలన చేయడమే కష్టమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గడ్డం, మీసాలు లేవని అన్నది తనను కాదని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని కూడా అన్నారని చెప్పారు.

రాబందు పాల‌న న‌డుస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయింది కానీ ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు రైతుబంధు కాలం పోయింది రాబందు పాలన వచ్చింద‌ని కేటీఆర్ అన్నారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన బోథ్ నియోజ‌క‌వ‌ర్గ నూత‌న స‌ర్పంచ్‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఆయ‌న మాట్లాడారు.  అదిలాబాద్ జిల్లాలో అత్యధిక మంది రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో లేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తైపోయాడు సోయా రైతులు పట్టించుకునే వాళ్ళు లేరు.  రైతన్న మా పార్టీ హయాంలో రాజు లెక్క ఉండేవాడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఆయన ఇంటి ముందుకు వచ్చేయి. అందుకే ఏనాడూ తెలంగాణలోని రైతన్న కేసీఆర్  మీద కోపంతో లేడు రైతుబంధు ఇచ్చిన రైతు బీమా ఇచ్చినా 7000 కేంద్రాలు పెట్టి కొనుగోలు పంట కొనుగోలు చేసిన అన్ని రైతన్న కోసమే చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్.  అదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో అదిలాబాద్ ఖానాపూర్ కాగజ్ న‌గ‌ర్‌ వంటి నియోజకవర్గాలు కోల్పోయాం. చిన్నచిన్న పొరపాట్ల వలన ఈ సీట్లని కోల్పోయాం. కానీ పంచాయతీ ఎన్నికల్లో మ‌న పార్టీ వెంట వున్నామ‌ని ప్ర‌జ‌లు  తేల్చి చెప్పార‌న్నారు. ఎమ్మెల్యే అనిల్ యాదవ్ డబ్బు ద‌ర్పం లేకపోవచ్చు పేదవాడు కావచ్చు కానీ మంచి క్యారెక్టర్ మంచి మనసున్న నాయకుడు అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన పార్టీ శ్రేణుల పైన ఉన్నద‌న్నారు. అదిలాబాద్ ఉమ్మడి జిల్లాను మా పార్టీ హయాంలో అద్భుతంగా అభివృద్ధి చేశాం. కానీ బిజెపి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి స్వయంగా అమిత్ షా మాట ఇచ్చి తప్పిండ‌న్నారు. కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ పత్తి కొన‌కుంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నిలదీయలేదు దీనిపైన కూడా మనమే రోడ్డు ఎక్కి ధర్నాలు చేయవలసి వచ్చింద‌న్నారు. రెండు సంవత్సరాల కాలంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి. గత ప్రభుత్వం అప్పుల పైన చెప్పిన తప్పుడు లెక్కలన్నింటినీ ప్రజలు గుర్తిస్తున్నార‌న్నారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం అందించడమే కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణ తీసుకువచ్చి అభివృద్ధి చేయడమే తప్పా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లోను పంచాయతీరాజ్ ఎన్నికల స్ఫూర్తితో పని చేద్దామ‌న్నారు. ఈ గెలిచిన సర్పంచులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రెండు సంవత్సరాల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *