– మూసీ సుందరీకరణ అవసరమే
– అందుకోసం ఇళ్లను కూలగొడతామంటే ఒప్పుకోం
– హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ యత్నించారు
– రేవంత్ హయాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బతుకులే
– గాంధీ విగ్రహం కోసం అపార్ట్ మెంట్‌ను కూలగొట్టడం అన్యాయం
– అపార్ట్ మెంట్వాసులకు అండగా వుంటాం
– మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు పరామర్శించారు.కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఆలోచించారు. ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేసీబీలతో కూల్చే ప్రయత్నం చేస్తున్నాడని హరీష్‌రావు ఆరోపించారు. కేసీఆర్ కు మధు పార్క్ అపార్ట్‌మెంట్‌తో మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు మూడుసార్లు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్‌ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని గుర్తు చేశారు. ఇక్కడ మంచినీళ్లు లేక మీరు అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే అప్పటికప్పుడు హెచ్ఎం డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి మరీ మీకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. సబితక్కకు ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే మీ ముందు రోడ్డు వేయించారు. నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి మూసీని క్లీన్ చేయించి మీకు దోమల బెడద లేకుండా చేశారని కూడా వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదు. పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా తయారు చేయించింది. అప్పుడు తమ ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయితీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట మీ ఇండ్లు కూల్చి మీ భూములు లాక్కొని వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ఆరోపించారు. మీ జేబులు నింపుకోవడానికి చేసే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మేం పూర్తిగా వ్యతిరేకం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో కట్టిన ఇల్లు ఒక్కటీ లేదు. కూల్చిన బతుకులు, కూల్చిన ఇండ్లు తప్ప మరేమీ లేవు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బుల్లేవంటాడు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధు అడిగితే డబ్బుల్లేవంటాడు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారు. అడిగితే రాష్ట్రం దివాలా తీసింది.. నా దగ్గర పైసల్లేవు నన్ను కోసుకు తింటారా అంటాడు. మరి పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వవచ్చాయి అని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్లతో సీఎం క్యాంపు ఆఫీస్, రూ.5 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి? బడా కాంట్రాక్టర్లకు రూ.20,000 కోట్ల బిల్లులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ ఎక్కడినుంచి వస్తున్నాయి అని ప్రశ్నించారు. మేం మూసీ శుద్ధికి వ్యతిరేకం కాదు. ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చెయ్కే.. సీఆర్ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చేయాలన్నారు. మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బాపు ఘాట్ వద్ద అహింసామూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప ఆ విగ్రహం నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ఇండ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి ఈ అపార్ట్‌మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అది అన్నారు. ఇండ్లు కూల్చడమంటే ఇక్కడి బతుకులను కూల్చడమే. పసిపిల్లలు కంటిమీద కునుకు లేకుండా రేపు పరీక్షలు ఎలా రాస్తారు? ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదు. ఎఫ్‌టీఎల్ ఫిక్స్ కాలేదు. ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రాలేదు. కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ కూడా జరగలేదు. అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇందాక ఒక సోదరి మాట్లాడుతూ ‘వి వాంట్ కేసీఆర్ బ్యాక్’ అని అన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అప్పుడు ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రేట్లు పడిపోయాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఎక్కడ చూసినా దోపిడీయే. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరిట, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట, భూముల అమ్మకాల పేరిట అంతా దోపిడీ చేస్తున్నారు. మేం కేవలం రాజకీయాల కోసం కాదు, ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం బేషజాలకు, పట్టింపులకు పోకుండా మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పక్కనే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోండని హితవు పలికారు. మా ఇండ్లు కూలగొట్టే బదులు.. మా నీళ్ల ట్యాంకులో విషం కలిపితే మేమంతా తాగి చచ్చిపోతాం.. మమ్మల్ని చంపండి అని ఇక్కడ ఒక తల్లి అన్న మాట నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. మీరెవరూ ఆందోళన చెందకండి, భయపడకండి. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై ఎంత దూరమైనా వెళతాం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పక్షాన మీకు అండగా నిలబడి, చట్టపరంగా పూర్తి స్థాయి పోరాటం చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





