– వికాసమా.. విధ్వంసమా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది
~ అన్ని రంగాల్లో తిరోగమనం.. క్రైంలో పురోగమనం
– ‘మీట్ ద ప్రెస్’లో ఓటర్లకు హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు.. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శుక్రవారం నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదు.. నాలుగు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం అంటూ వికాసం కావాలా, విధ్వంసం కావాలో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశాడు.. ఫీజు రియంబర్స్‌మెంట్ రాలేదంటే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసుల దాడులు చేయిస్తున్నాడు అని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయక హాస్పిటల్స్‌ను బెదిరిస్తున్నారు.. ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు.. ఉద్యోగులకు అత్యధిక డీఏలు పెండిరగ్.. చేసింది చెప్పుకునేది లేక చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికలో అక్కడి నాయకులు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎన్నికలో అనేక హామీలు ఇచ్చారు.. ఏం చేశారో చూపాలని సవాల్ విసురుతున్నానన్నారు. రెండేళ్లుగా మైనారిటీకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతల నిర్వహణ లేదని, నడి రోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులకు జీతాలు, బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి నరకం చూపిస్తున్నడు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే రేవంత్ గన్ కల్చర్ పెంచిండన్నారు. మేం అనడం లేదు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమైతది అని అన్నారు. రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చొని క్రైం మీద రివ్యూ చేయడం లేదు గాని కమీషన్ల మీద రివ్యూ చేస్తున్నాడన్నారు. రేవంత్ రెడ్డి మున్సిపల్ మంత్రిగా, విద్యా మంత్రిగా, హోం మంత్రిగా ఫెయిల్.. టోటల్‌గా సీఎంగా అట్టర్ ఫెయిల్యూర్ అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. మేము పట్టాలు ఇస్తే నువ్వు ఇండ్లు కూల్చావు అని అన్నారు. హైడ్రా, హెచ్‌సీయూ భూములు, టిమ్స్ హాస్పిటల్స్ విషయంలో, బస్తీ దవాఖానాల ఉద్యోగుల కోసం, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీసింది బీఆర్‌ఎస్ మాత్రమేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి మోసం చేశాయన్నారు. మైరిటీలకు రూ.4000 కోట్ల బడ్జెట్ ఏమైందన్నారు. బీఆర్‌ఎస్ నిలదీయడం వల్ల అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోయినపుడు అక్కడ వారి భార్యను నిలబెడితే రండ రాజకీయం అన్న రేవంత్ ఈరోజు సునీతను నిలబెడితే దారుణంగా మాట్లాడుతున్నాడన్నారు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు బంద్ పెట్టాడన్నారు. మీరు న్యాయ నిర్ణేతలు.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి అని ఓటర్లకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





