– డీపీఆర్ సిద్ధం కాకుండా రూ.లక్షన్నర కోట్ల వ్యయమని ఎట్లా చెప్పారు?
– మూసీ లూటిఫికేషన్ షురూ
– బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ కంపెనీకి కాంట్రాక్టా?
– మూసీని కలుషితం చేసిందే సమైక్య పాలకులు
– డిజైన్లు సిద్ధంగా వుండగా కమీషన్ల కోసమే కొత్త నాటకం
– బీఆర్ఎస్ హయాంలో రూ.16వేల కోట్లతో అంచనాలు తయారు
– పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నామని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో రేవంత్ కొండంత విషం పెట్టుకున్నారన్నారు. అసలు డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే లక్షన్నర కోట్లు వ్యయం అవుతుందని ఎట్లా చెప్పారని ప్రశ్నించారు. డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మూసీ లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు. మూసీని ఆనుకుని నివసించే లక్ష మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తామని అధికారికంగా ప్రకటించారన్నారు. దశాబ్దాలపాటు నల్గొండ జిల్లా ప్రజలను మూసీ మురికితో ఇబ్బందుల పాలుచేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక పథకంతో నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్నిరకాల డిజైన్లు సిద్ధం చేశాయని, వడ్డించిన విస్తరి లాంటి ప్రాజెక్టును పక్కనపెట్టి మళ్లీ కమిషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. దాదాపు రూ.16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అంచనాలను లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారన్నారు. రూ. 1100 కోట్లతో కొండ పోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు కాళేశ్వరం నీళ్లను తరలించాలని ప్రణాళికలు రచిస్తే, ఇప్పుడు అంచనాలు అమాంతం పెంచి దండుకోవాలని చూస్తున్నారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేసేలా ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక కూడా గతంలోనే సిద్ధంచేశామన్నారు. మూసీలోకి చేరే 2000 ఎంఎంల్డీ మురుగునీటి శుద్ధి కోసం 36 ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేశామన్నారు. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాలన అంశంపై అన్ని అబద్దాలు వల్లె వేశారని, తన అవినీతి ప్రణాళికలను, కుట్రలను ప్రజల ముందు ఉంచారని ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కారు అంటే కూల్చివేతలు
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలేసి మూసీ ప్రక్షాళన పేరిట లక్షన్నర కోట్ల లూటికి ముఖ్యమంత్రి రేవంత్ తెరలేపారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ మూసీని ఆనుకుని నివసించే లక్ష మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తామని అధికారికంగా ప్రకటించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు అంటే కూల్చివేతలు తప్ప నిర్మాణాలు కాదని మరోసారి తేలిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని స్పష్టంచేశారు. కలుషితమైన మూసీ కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని ధ్వజమెత్తారు. తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్న రేవంత్, రాత్రికి రాత్రి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను ముంచారని మండిపడ్డారు. ఓవైపు 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టి, ఇప్పటికిప్పుడు బ్యూటిఫికేషన్ చేపట్టాలనుకోవడం వెనక అసలు ఉద్దేశం మూసీలో మూటల వేట మాత్రమేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల పట్టపగలే హైదరాబాద్ లో నడిరోడ్డుపై హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లు సేఫ్ సిటీగా ఉన్న రాజధానిని క్రైం సిటిగా మార్చిన ఘనత రేవంత్ దే నన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీకి కేంద్రంగా మారుస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి మరి డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ తయారీ కాంట్రాక్టును మెయిన్ హార్ట్ కు అప్పగించడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో అనేక మంది మంత్రులు అక్రమంగా కట్టిన గెస్టు హౌజుల్లో ఏ ఒక్కదాని వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోని ముఖ్యమంత్రి, పేదల ఇళ్లను మాత్రం కనీస కనికరం లేకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. అసలు సమైక్యరాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ టిడిపి ప్రభుత్వాలని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీల్లోనే పనిచేసిన చరిత్ర మర్చిపోవడం విడ్డూరంగా ఉందని, గతంలో మీరు చేసిన పాపమే మూసిని మురికి కూపంగా మార్చిందన్నారు. నల్గొండ గుండెల మీద ఫ్లోరైడ్ బండ పెట్టి లక్షలాదిమంది చందమామల్లాంటి పిల్లల జీవితాలను ఛిద్రం చేసిన పాపం కూడా సమైక్య పాలకులదేనని మండిపడ్డారు. గత పాలకులు అని తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న పన్నాగాలను అర్థంచేసుకోలేంత అమాయకులు ఎవరూ లేరని స్పష్టంచేశారు. మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక పథకంతో నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
అనుయాయులు, బినామీలకు భూములు కట్టబెట్టే కుట్ర
మూసీ పరివాహక ప్రాంతం నుంచి పేద, మధ్యతరగతి ప్రజలను బలవంతంగా వెల్లగొట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన భూములను తన అనుయాయులకు, బినామీలకు కట్టబెట్టే కుట్ర కొనసాగుతోందని కేటీఆర్ స్పష్టంచేశారు. పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని, రెండేళ్ల నుంచి మూసీ చుట్టుపక్కల ఉన్న భూములను ఎలా కబళించాలని కుట్ర చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో తాము బుల్‌డోజర్లకు అడ్డంపడి బాధిత ప్రజలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు. అయితే మళ్లీ మూసీ ప్రాంత ప్రజలను కాటు వేసేందుకు రేవంత్ చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్ని రకాల డిజైన్లు సిద్ధం చేశాయని, వడ్డించిన విస్తరి లాంటి ప్రాజెక్టును పక్కనపెట్టి మళ్లీ కమీషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. డిజైన్లు సిద్ధంగా ఉండగా మళ్లీ ఎందుకు మొదటినుంచి ప్రక్రియ చేపడుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం ప్రణాళికల రూపకల్పన కోసమే రేవంత్ సర్కారు వందల కోట్లు ఖర్చుచేస్తుందంటే, ఇక ఈ స్కామ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓవైపు అప్పు పుడ్తలేదంటూనే ఏడీబీ బ్యాంకు నుంచి రూ.4100 రుణం తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం రేవంత్ రెండునాల్కల విధానానికి నిదర్శనం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఓసారి రూ.50వేల కోట్లు అని, మరోసారి రూ.75వేల కోట్లు అని, ఇంకోసారి రూ.లక్ష న్నర కోట్లు అని ప్రాజెక్టు చేపట్టకముందే అంచనాలు పెంచుతున్న రేవంత్ సర్కారు చివరికి ఈ కుంభకోణానికి ఎన్ని లక్షల కోట్లకు తీసుకెళుతుందో లెక్కే లేదని మండిపడ్డారు. జీవం కోల్పోయిన మూసీకి ప్రాణం పోసే మహాయజ్ఞానికి బీఆర్ఎస్ హయాంలోనే అంకురార్పణ చేశామన్నారు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేయడంతోపాటు, మూసీలోకి చేరే 2000 ఎంఎంల్డీ మురుగునీటి శుద్ధి కోసం 36 ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీలకు రిబ్బన్లు కట్ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. ఏ కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు కూతలు కూశారో, ఆ కాళేశ్వరమే మూసీకి ప్రాణం పోసే జీవనాడిగా నిలుస్తోందని తెలిపారు. నాగోల్-ఉప్పల్ భగాయత్ వద్ద 5 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులను గతంలోనే పూర్తిచేశామని, పేదల ఇళ్లు కూల్చకుండా పార్కుల నిర్మాణంతో పచ్చదనం పెంచిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేసేలా ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక కూడా గతంలోనే సిద్ధంచేశామన్నారు. అభివృద్ధి పేరిట పేదలను నిరాశ్రయులను చేయడం సరైన పద్ధతి కాదని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన సూచన మేరకే ముందుకెళ్లాం తప్ప అక్కడి ప్రజలను రేవంత్ సర్కారులాగా ఇబ్బంది పెట్టలేదని గుర్తుచేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసే కాంగ్రెస్ సర్కారు అవినీతి బాగోతాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎక్కడికక్కడ ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




