రేవంత్ ఎప్ప‌టికైనా బీజేపీ మ‌నిషే!

– పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకెళ్లారు?
– స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌ను మోసం చేశారు
– ఒక‌ప్పుడు పోచారంను బూతులు తిట్టిన రేవంత్‌
– కాంగ్రెస్‌లో చేరి బాన్సువాడ‌కు ఏం లాభం చేశాడు?
– బాన్సువాడ‌ను అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ మాత్ర‌మే
– బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

బాన్సువాడ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7: రేవంత్ రెడ్డి ఏనాటికైనా బిజెపి మనిషే, అయన కప్పుకున్న ముసుగు తొలగించి చూడాలని బీఅర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రజలను కోరారు. రేవంత్ ఏనాటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడని అన్నారు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ ముసుగును తొలగించి చూడాలని, ఆయన లోపల ఉన్న బీజేపీ నాయకుడిని గుర్తించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలని కాంగ్రెస్ చేస్తున్న వాదన అర్థరహితమన్నారు. అధికారంలో ఉండి గత రెండు సంవత్సరాల్లో ఏం చేశారో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. ఒకవేళ రానున్న రెండు సంవత్సరాలపాటు అధికారంలో ఉంటే మరి తరువాత మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా గతంలో మాదిరి అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. మైనారిటీలకు, బీసీలకి భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను అమలు అయితే ఆ పార్టీ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వాళ్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు పోచారం సమాధానం చెప్పాలి

కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాన్సువాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా కేటీఆర్.. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు ఆయన కొడుకులను తిట్టిన ఆడియో వీడియో క్లిప్పులను వినిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఇదే పోచారాన్ని అంబోతు అని, ఆయన కొడుకులు దున్నపోతులని, రోడ్డు మీద వదిలారని, కాంట్రాక్టుల పేరుతో అవినీతి చేస్తున్నారని, కమిషన్లు తింటున్నారని, ఇసుక దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలని  వినిపించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి పోచారం బండకట్టుకొని బావిలో దూకు అని అన్న మాటలను కేటీఆర్ ప్రస్తావించారు. మరి దీనితోపాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరుని సాక్షిగా జీవితాంతం కేసీఆర్ వెంట ఉంటానని, కేసీఆర్ చల్లని చూపుతో బాన్సువాడను చేసిన అభివృద్ధి ఎన్నడూ మర్చిపోలేనని, తనకు చూపిన ప్రేమాభిమానాలను కూడా మర్చిపోలేనని చెప్పిన మాటల్ని కూడా వినిపించారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో చొచ్చినా వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంకా బీఅర్ఎస్ లోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఈనాడు బాన్సువాడ ప్రజలు కూడా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారని, డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్ద నాయకుడు పోచారం కాలేడని అన్నారు. దమ్ముంటే ఇంత అనుభవం ఉన్న పోచారం రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని, ప్రజలు ఎవరి వైపు ఉంటారో నిర్ణయిస్తారని కేటీఆర్ సవాల్ విసిరారు. లేకుంటే బండ కట్టుకుని రేవంత్ రెడ్డి అన్నట్లు బావిలో దూకాలన్నారు. మంత్రిని చేసి, స్పీకర్ ని చేసి గౌరవిస్తే బాన్సువాడ ప్రజలను, కేసీఆర్ ను, బీఅర్ఎస్ ని మోసం చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు. ఆనాడు కేసీఆర్ చలవతో రూ.10వేల కోట్ల అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ నిజంగానే పోచారం అభివృద్ధి చేసి ఉంటే గత రెండేళ్ల‌ల్లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *