అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టిస్తారా?

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్‌ ఫైర్‌
– ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: స్సీకర్‌కు వినతి
– ‘కాళేశ్వరం‘ నివేదికపై శాసనసలో చర్చ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: అసంపూర్తి సమాచారంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రాణహిత-చేవెళ్లలో నీరు అందుబాటులో ఉంది, హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి 2014 అక్టోబర్‌ 24న స్పష్టంగా చెప్పారన్నారు. 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని లెటర్‌ రాస్తే వీళ్ల తప్పుడు విధానాలతో తిరిగి పరిశీలించాలని కేంద్రానికి హరీష్‌ రావు మళ్లీ లేఖ రాశారన్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్‌ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడుగుతారా అని వ్యాఖ్యానించారు. 2009లో కూడా ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతినిచ్చిందని, ఈ రికార్డులను కావాలనే ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొక్కిపెట్టిందని సీఎం ఆరోపించారు. చెప్పిన అబద్దాన్నే హరీష్‌ మళ్లీమళ్లీ చెబుతున్నారుని, ఆనాడు మంత్రిగా ఉన్న ఆయన ఈనాటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా పేరు, ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 2014లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 2015 మార్చి 13న ఉమాభారతి లేఖను పట్టుకుని హరీష్‌ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని, విద్యాసాగర్‌ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే సూచించిందని సీఎం చెప్పారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్‌ ప్రాజెక్టు తలకెత్తుకున్నారన్నారు. రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ కమిటీ నివేదికను పట్టించుకోకుండా దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఘోష్‌ కమిషన్‌ నివేదిక పేజీ నెంబర్‌ 63లో స్పష్టంగా చెప్పిందన్నారు. ఎక్స్పర్ట్‌ కమిటీ విచారణలో తన మామ, బావమరిది చేశారని హరీష్‌రావు తన నిస్సహాయతను ఒప్పుకున్నారని 65వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు అందుకే నివేదికపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నారంటూ ఇప్పటికైనా ఏవిధమైన విచారణ చేపట్టాలో హరీష్‌రావు చెప్పాలని నిలదీశారు.. సీబీఐ కావాలా, సీబీసీఐడీ కావాలా, ఆర్‌ విచారణ కావాలో చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసంపూర్తి సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను రేవంత్‌ కారారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *