రేవంత్ కు విలువలు లేవనేది స్పష్టమైంది

– బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు విలువ‌ల‌ను దిగ‌జారుస్తున్నాయి

~బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలువదని మాట్లాడడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఉన్నామని చెప్పడం వారి అనైతికతకు నిదర్శనమ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధినేతలు అబద్ధాలు మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టించడం పరిపాటిగా మారిందన్నారు. బుధ‌వారం ఇక్క‌డ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని స్పష్టమైనద‌న్నారు. ముఖ్యమంత్రి త‌న‌ మాటలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని ముఖ్యమంత్రి అని స్పష్టమైంద‌న్నారు. దానం నాగేందర్ మాటలను అసెంబ్లీ స్పీకర్ సుమోటాగా తీసుకొని అనర్హుడిగా ప్రకటించాల‌ని కోరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారా, బీఆర్ఎస్‌లో ఉన్నారా అన్న విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వానికే స్పష్టత లేకపోవడం దౌర్భాగ్యకరంమ‌న్నారు. రాష్ట్ర రాజకీయాల్లో విలువలు క్షీణించే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుంద‌న్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌కు చెందినవారమని చెబుతుండగా, స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్ఎస్‌కు చెందినవారమని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమ‌ని రామ‌చంద‌ర్‌రావు విమ‌ర్శించారు. ఈ రాజకీయ గందరగోళానికి నాంది పలికింది బీఆర్ఎస్ అని, ఇపుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంద‌ని విమ‌ర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీదేన‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *