రిటైర్డు ఉద్యోగుల వేదన వినిపించడంలేదా?

– రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై హరీష్‌రావు ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా.. వేదన వినిపించడం లేదా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ అంటవు.. మరో లక్ష కోట్లతో ఫోర్త్‌ సిటీ అంటవు.. వేల కోట్లతో అక్కరకు రాని చోట ఆరు లేన్ల రోడ్లు వేస్తానంటవు.. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్‌ చేస్తుంటవు కానీ విశ్రాంత ఉద్యోగులకు మాత్రం రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయవేమి అని నిలదీశారు. కమీషన్లు రావని విశ్రాంత  బకాయిలు విడుదల చేయడం లేదా? నీకు మనసు లేదా? 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఓ విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నదన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం, అనైతికం అన్నారు.  ఇప్పటికే అనేకమంది మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ప్రతి నెలా రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయంటూ దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు రూ.10వేల కోట్ల బకాయిలు పెట్టిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్‌ కోసం విశ్రాంత ఉద్యోగులను కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా, పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీఆర్‌సీి, డీఏలు కూడా చేరడం దురదృష్టకరం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో గాలికి వదిలేశారు. రెండుమూడు నెలలు జీతాలు అందక ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ మాటల మాయాజాలంతో ఎంతకాలం ఉద్యోగులు, టీచర్లను మోసం చేస్తారు అని హరీష్‌రావు నిగ్గదీశారు. రిటైట్‌ బెనిఫిట్స్‌ ను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *