– బకాయిలు వెంటనే చెల్లించాలని ‘చలో అసెంబ్లీ’
– అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి
వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 5ః రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలనే ఏకైక డిమాండ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అసోసియేషన్ వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు చెప్పారు. అసెంబ్లీ ముందు గల మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి వందలాదిమంది పాల్గొన్నారన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 500 మంది పెన్షనర్లు అక్రమంగా ఉంచారని, అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని కందుకూరి ఖండించారు.మార్చి 2024 నుండి ఇప్పటివరకు తమకు బకాయిలు చెల్లించకపోవడంతో అనేకమంది పెన్షనర్లు అప్పుల బారిన పడుతూ, బ్యాంకు రుణాలు చెల్లించలేక, బ్యాంక్ ఈఎంఐలు, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్‌లో చికిత్స పొందేందుకూ డబ్బులు లేక అనేక బాధలు పడుతూ, మానసిక వేదనతో కుంగిపోతున్నారని, ఇప్పటివరకు 42 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం బాధాకరమని తెలిపారు. వీరి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి తమకు తక్షణం న్యాయంగా రావలసిన జీపీఎఫ్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ 2020 ఎరియర్స్ తదితర పెండింగ్ బిల్లులన్నింటినీ ఏకమొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పెన్షనర్లందరినీ వాహనాలలో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని చెప్పారు. తమను అర్థగంటసేపు రోడ్లన్నీ తిప్పి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు 30 మందిని తరలించారన్నారు. అక్కడ కూడా పలు చానళ్లకు తమ సమస్యలపనై ఏకరువు పెట్టామన్నారు. తమ బాధల గురించి వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, శాసనమండలిలో మాట్లాడతారని తాము చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





