జాతీయ భాషనూ గౌరవించాలి

రాజభాషా స్వర్ణోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11 : జాతీయ భాషా విభాగం ఏర్పడి యాభయ్యేళ్లు పూర్తి అయిందని, ఈ కాలంలో సాధించిన ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడం, సంబరాలు చేసుకోవడం ఒక ఎత్తయితే భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకోవడం మరో కీలకమైన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాజభాష స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత యాభయ్యేళ్లలో హిందీ భాషను పాలనా వ్యవస్థలో ఒక సహజ భాషగా మార్చే క్రమంలో రాజభాషా విభాగం అనేక చర్యలు తీసుకుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో దేశవ్యాప్తంగా హిందీ, భారతీయ భాషలకు స్వర్ణయుగమని ఈ 11 ఏళ్ల కాలాన్ని చెప్పుకోవచ్చన్నారు. రాజభాషా విభాగం ద్వారా భారతీయ భాషలు, మాతృభాషలతోపాటు హిందీ ప్రాచుర్యాన్ని పెంచేందుకు అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. భారతీయ సంస్కృతిని, సంపన్న సంప్రదాయాలను, ప్రాచీన వారసత్వాన్ని బలపరిచేందుకు విదేశీ భాషలకు బదులు మన భారతీయ భాషల వాడకం ఎంతో అవసరమని, ఈ విషయాన్ని మహానుభావులెందరో చాలా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలు ప్రాంతీయ భాషలకు గౌరవాన్ని ఇస్తూనే ఒక జాతీయ భాష ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి మన భాషకు అంతర్జాతీయ గౌరవం తీసుకొచ్చారన్నారు. మన దేశంలో అనేక భిన్న భాషలున్నప్పటికీ వాటిలోని భావన మాత్రం ఒకటేనన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వందేమాతరం, భారత మాతాకీ జై నినాదాలు దేశమంతా ప్రతిధ్వనించాయంటూ భాషలు వేరైనా భారతీయులందరి భావన ఒక్కటేననడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషల ద్వారా ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వికసిత భారత్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు మనమంతా కలిసి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రజలందరినీ తమతమ మాతృభాషల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకు అనుసంధానించడం చాలా అవసరమని, అప్పుడే ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని ప్రతి భాషా మన సంస్కృతికి ఆభరణం వంటిదని, వీటి మధ్య పరస్పర సహకారం, పరస్పర అనుసంధానతే ఉంటుంది తప్ప పోటీ ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చాలా సందర్భాల్లో పేర్కొన్నారని తెలిపారు. మాతృభాషలలో విద్యను ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం హిందీలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులను ప్రారంభించిందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మనం భాషా బానిసత్వం నుంచి బయటపడాలన్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కూడా ‘హిందీకి వ్యతిరేకంగా చేసే ఏ ఉద్యమమైనా అది దేశాభివృద్ధికి అడ్డంకే అని స్పష్టంగా చెప్పారన్నారు. భారతీయ భాషలు మన సంభాషణలకు వేదిక, మన సంస్కృతికి ప్రాణం అని చెప్పారు. సంస్కృతం, ఒడియా, తమిళం వంటి భాషలు వేలాది ఏళ్ల చరిత్ర కలిగినవి.. ఇవి దేశానికి గుర్తింపు తీసుకురావడంతోపాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలని, అందుకే భిన్నత్వంలో ఏకత్వం లాగానే భాషావైవిధ్యత మన భాషా ఐకమత్యానికి బాటలు వేసిందని వివరించారు. ఇదే భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 11 భారతీయ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించిందని, వీటన్నింటికీ కనీసం 1500-2000 సంవత్సరాల చరిత్ర ఉందని మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2020లో తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలోనూ ప్రాంతీయ భాషలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రధాని మోదీ కూడా విదేశీ పర్యటనల్లో హిందీలోనే మాట్లాడటం, వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి భాషలో మాట్లాడటం ఇవన్నీ భారతీయ భాషల గౌరవాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయాలేనని కిషన్‌రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *