– తిరిగి మన వాటా రాబట్టేందుకు పోరాటం
– ఎన్‌డిఎస్‌ఏ మార్గదర్శకాలకనుగుణంగా కాళేశ్వరం బ్యారేజిల పునరుద్ధరణ
-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీి బీఆర్‌ఎస్ పాలకులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంద్రప్రదేశ్‌తో కుమ్మక్కై నీటి మళ్లింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కృష్ణా జలాశయాలను ఆంద్రప్రదేశ్‌కు అక్రమంగా తరలించిన అంశంతోపాటు తుమ్మడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చిన అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ అతిధులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌లతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,వి నోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా జలాశయాలలో తెలంగాణాకు రావలసిన నీటి వాటాను రాబట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో 2004 నుండి 2014 వరకు ఆంద్రప్రదేశ్ 245.3 టిఎంసిల నీటిని తరలించుకుపోగా 2014 నుండి 2024 వరకు 1,192.44 టీఎంసీలకు పెరిగిందని సోదాహరణంగా వివరించారు. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల, ముచ్చుమర్రి ప్రాజెక్టుల విస్తరణకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు అయితే ఈ పనులన్నీ కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేపట్టారని ఉత్తమ్ తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేఆర్‌ఎంబికి గానీ, కేంద్ర జల సంఘం వద్ద కానీ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం శోచనీయమన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో ఏపీకి 512 టిఎంసిలు,తెలంగాణకు 299 టిఎంసిలు వినియోగించేలా 2017లో తెలంగాణాకు 34 శాతం ఏపీకి 66 శాతం చేసుకున్న ఒప్పందం 2020 వరకు కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 మార్చి 3న కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో మొత్తం 811 టిఎంసిలలో తెలంగాణాకు 61 శాతం అంటే 575 టిఎంసిలను కేటాయించాలని అధికారికంగా చేసిన డిమాండ్‌ను ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోయిన నీటిలో మచ్చుమర్రి ఎత్తిపోతలకు 0.85 టిఎంసిల సామర్ధ్యం నుండి 3 టిఎంసిలకు, రాయలసీమ ఎత్తిపోతల 3 టిఎంసిల నుండి 8 టిఎంసిల సామర్ధ్యంకు పెంచుకున్నారని తెలిపారు. అంటే అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వ ఉదాసీనతతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 11 టిఎంసిల నీటి సామర్ధ్యం పెంచుకుందని దుయ్యబట్టారు. అదేవిదంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై ఆయన ప్రస్తావిస్తూ కేంద్ర జలసంఘం అనుమతితో 165 టిఎంసిలతో రూపొందించిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చడంతో రాష్ట్రంలో ఆర్థిక విపత్తు సంభవించిందని మండిపడ్డారు. అప్పటికే రూ.11,679 కోట్లు ఖర్చు పెట్టడంతోపాటు కేంద్రం నుండి 80 శాతం సహాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనం కోసమే ఉద్దేశపూర్వకంగా మార్చారని ఆయన విమర్శించారు. అవసరమైన బోర్ హొల్స్ తవ్వక పోవడం, డిజైన్ మార్చడం వంటి అనేక కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలిందని ఎన్‌డిఎస్‌ఏ ఇచ్చిన నివేదికలో స్పష్టం అయిందన్నారు. 155 టిఎంసిలలో 63టిఎంసిల నీటిని నిరుపయోగంగా వదిలేశారన్నారు. కేవలం 27 టిఎంసిల నీరు మాత్రమే రిజర్వారాయర్లకు చేరిందని, ఆ నీటితో కేవలం 98,570 ఎకరాలే సాగులోకి వచ్చిందన్నారు. 37 లక్షల ఎకరాలు సెద్యంలోకి వచ్చిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పారు. అలాంటి ప్రాజెక్ట నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఎన్ణ్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు లోబడి ప్రాజెక్టును పునరుద్దరిస్తామని, అయితే ప్రమాదకరంగా మారిన నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయబోమని చెప్పారు. బిఆర్‌ఎస్ నేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే చేస్తున్న విమర్శలు ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు. తెలంగాణ రైతాంగం కోసం ఎలాంటి రాజీ ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.





