ప్ర‌భుత్వానికి కొరుకుడుప‌డ‌ని రిజ‌ర్వేష‌న్లు

కేంద్రం ఆమోదించ‌క‌పోతే ప‌రిస్థితేంటి?
– న్యాయ నిపుణుల‌తో మంత‌నాలు

( మండువ రవీందర్‌రావు )

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత పద్నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దీంతో రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో తమవారిని గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమైనాయి . ప్రధానంగా గత పధ్నాలుగు నెలలుగా సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో పాలన కుంటుపడింది. అభివృద్ది కార్యక్రమాలను పెద్దగా పట్టించుకున్నవారులేరు. ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ వారికున్న పని ఒత్తిడితో అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారన్న అపనింద ఉంది. కేంద్రం నుండి నేరుగా పంచాయితీలకు అందాల్సిన నిధుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. అంతేగాక వచ్చేఎన్నికల్లో ఎలాగూ తామే గెలుస్తామన్న ధీమాతో సర్పంచ్‌లు కొందరు గ్రామాభివృద్ధి పనులపైన తమ స్వంతడబ్బును వెచ్చించినవారికి గత పధ్నాలుగు నెలలుగా బిల్లులురాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురైనారు. దీనిపై వారు కోర్టుకు వెళ్ళక తప్పలేదు. అనేక వాయిదాల అనంతరం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో అందరి క‌ళ్ల‌లో ఆనందం వెల్లివిరిసింది. కోర్టు ఆదేశం ప్రకారం మొత్తానికి మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు బిసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే అంశం ఇప్పుడు అధికార పార్టీకి కక్కలేక మింగలేకుండా ఉంది. ఇచ్చిన హామీమేరకు ఈ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్ళాలన్న విషయంలోనే సర్కార్‌ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నది. రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సర్కార్‌ ఇరవైరోజుల వ్యవధి అడిగితే న్యాయస్థానం మరో పదిరోజులు అద‌నంగాపెంచి ముప్పైరోజుల గడువు ఇచ్చింది. అయితే రిజర్వేషన్లను పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఇచ్చిన గడువులోగా పార్లమెంటులో ఈ బిల్లుపైన ఆమోద ముద్ర పడేఅవకాశాలు తక్కువే. ఎందుకంటే వచ్చే నెల 21నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాని, రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్‌ ‌ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉన్న గడవు జూలై 24 వరకు కావడంతో ఈలోగా ఆదరాబాదరగా పార్లమెంటు ఆమోదం లభించే అవకాశాలు ఉండకపోవచ్చనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు సర్కార్‌ముందున్న ప్రశ్న. ఒక పక్క కేంద్రంపైన వత్తిడి తెస్తూనే ప్రత్యమ్నాయ అన్వేషణలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ కేంద్రంనుండి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌రాకపోయినట్లు అయితే 42శాతం రిజర్వేషన్‌ల అమలుకు ఆర్డినెన్స్ ‌తీసుకురావడం లేదా ప్రత్యేక జీవోను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రత్యేక జీవో జారీలో న్యాయపరమైన సమస్యలేవైనా ఎదురవుతాయా అన్న కోణంలో న్యాయనిపుణులను ప్రభుత్వం సంప్రదించనుంది.  ఒకవేళ న్యాయపర చిక్కులు ఎదురవుతే ఇప్పటికే అమలులోఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదిఏమైనా రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలనుకూడా పరిగణలోకి తీసుకోవాల్సిఉంది. అలాంటిపరిస్థితిలో ఈ సమస్యను అధిగమించేందుకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌లను ఇస్తూనే, మిగిలిన శాతం రిజర్వేషన్‌లను పార్టీపరంగా భర్తీచేసే మరో ఆలోచనకూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇదిలాఉంటే స్థానిక ఎన్నికలకు పార్టీలు సంసిద్దం కావడానికి మంచి సమయమే దొరికింది. పాలకపక్షంతోపాటు ప్రతిపక్షాలు గ్రామాల్లో తిరిగి తమ పార్టీ శ్రేణులను సంసిద్దం చేసుకునేందుకు చాలినంత అవకాశముంది. ప్రభుత్వంకూడా వ్యూహాత్మక కార్యాచరణను చేపట్టినట్లు తెలుస్తున్నది. ముందుగా అనుకున్నట్లు పరిషత్‌ ఎన్నికలకు బదులు సర్పంచ్‌ ఎన్నికలతో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఎన్నికలు గ్రామీణ ప్రాంతంతో ముడివడి ఉన్నందున రైతులను ప్రసన్నం చేసుకునేందుకు తాజాగా రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదలచేసిన విషయం తెలిసిందే. ఎన్నికలముందు ఈ నిధులు విడుదలచేయడంలో కాంగ్రెస్‌ ఎత్తుగడను ప‌సిగ‌ట్టిన  బిఆర్‌ఎస్‌ ‌నేతలు విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇవ్వాల్సిన రెండువిడుతల రైతుబంధు నిధులను ఎందుకు ఇవ్వడంలేదని ఆ పార్టీ నిలదీస్తున్నది. కాని కాంగ్రెస్‌ ‌మాత్రం మెజార్టీ గ్రామపంచాయితీలను తమ స్వంతం చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు దూసుకుపోతున్నది. రాష్ట్రంలో 223 కొత్త గ్రామ పంచాయితీలతోకలిపి మొత్తం గ్రామపంచాయితీలు 12992 కాగా, ఇందులో ములుగు గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. కాగా 31 జిల్లా పరిషత్‌, 566 ‌జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు 5817గా ఉన్నాయి. అయితే కొత్త మునిసిపాల్టీల పరిధిలోకి కొన్ని ప్రాంతాలు వెల్లడంతో ఎంపీటీసీలు తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. న్యాయస్థానం ఇచ్చిన సమయం చాలా తక్కువ అంటే వచ్చే నెల 24లోగా వీటన్నిటి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేయాల్సిఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *