– బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దాన్ని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప-రిజర్వేషన్లు ఇవ్వడానికి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కేవలం పార్టీ స్థాయిలోనే ఇస్తామన్న ధోరణి అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీలపై మోపడానికి ప్రయత్నించడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గాలు లేక దాదాపు రూ.4,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని తెలిపారు. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహించినప్పుడే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుండి విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు. కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సంబంధించి అన్ని వివరాలను పరిశీలించి పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పాన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టులను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుందన్నారు. అనేక దశాబ్దాలుగా మావోయిస్టులు పేదలు, దళితులు, గిరిజనులను, పోలీసులు, పోలీస్ ఇన్ఫార్మర్‌ల పేరుతో అనేకమంది ప్రజలను, అదేవిధంగా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అనేకమందిని పొట్టనబెట్టుకున్నారున్నారు. మావోయిస్టులు తుపాకులు వదిలి వచ్చే మార్చి 31లోగా లొంగిపోవాలని కేంద్రం బలంగా హెచ్చరిక జారీ చేసిందని, వారికి లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు మావోయిస్టులు దుష్టశక్తుల మాటలు నమ్మి లొంగిపోకుండా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





