– బీసీల కుల గణనలో రోల్ మోడల్‌గా తెలంగాణ
– ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నప్రభుత్వం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
– 15న కామారెడ్డి సభ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై నిజామాబాద్ ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులతో కలిసి మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో గురువారం సమీక్షించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని మంత్రులు అభిప్రాయపడ్డారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో అమలు చేస్తామన్నారు. ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైనదన్నారు. సభ విజయవంతానికి అవసరమైన కార్యాచరణపై చర్చించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





