విద్యా నివేదిక తయారీ అర్బన్ నక్సల్స్‌తోనా?

– విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే
– తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో తెలంగాణ విద్యా విధానంపై నివేదిక తయారు చేయించడం ఆందోళనకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయన్నారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యా విధానం-2026పై మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విద్యా విధానం లక్ష్యం రాష్ట్రంలో అక్షరాస్యత పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు దారి చూపేలా ఉండాలని రామచందర్‌రావు సూచించారు. అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత ఉందని అన్నారు. కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకులాలను తొలగించాలనడం కూడా అభ్యంతరకరమన్నారు. ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందన్న ప్రచారం సరికాదని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు. విద్యా కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడు విద్యావంతులు, విద్యా నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌లు ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఎన్‌సీఈఆర్‌టీ మాజీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ పి.మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

గందరగోళంగా నివేదిక : తిరుపతి రావు

విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్ సూచనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని ఉస్మానియా వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ టి.తిరుపతిరావు అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సుమారు 80 శాతం టీచర్ల ఖాళీలు ఉన్నాయంటూ వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒకవైపు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలని చెబుతూనే మరోవైపు స్కూల్స్‌లో టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. కొత్తగా స్కూల్స్ ఏర్పాటు చేయడమేకాÅ£ బలహీనవర్గాల ప్రాంతాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయడం అవసరమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

విద్యా ప్రమాణాలను దెబ్బతీసే ప్రమాదం

విద్యా కమిషన్ రిపోర్టు దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బదులు గందరగోళానికి గురిచేసే సూచనలు ఉన్నాయని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులను 45 మార్కులతో పాస్ చేయాలని ప్రతిపాదించడం సరైనది కాదని, ఇలాంటి నిర్ణయాలు విద్యా ప్రమాణాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని అన్నారు. 45 మార్కులతో పాస్ చేయడం వల్ల బలహీనవర్గాల విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయి డ్రాపౌట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విద్యా విధానాలు పరిమితులు దాటి ఉన్నాయనే భావన కలుగుతోందన్నారు. విద్యా కమిషన్ రిపోర్టులో గతంలో విద్యా వ్యవస్థ ఎందుకు నష్టపోయిందనే విశ్లేషణ కనిపించడం లేదని, భవిష్యత్తులో విద్యా వ్యవస్థను ఎలా అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన దిశా నిర్దేశం కూడా లేదని విమర్శించారు. ఉపాధ్యాయుల వేతనాలను తగ్గించాలని సూచించడం సమంజసం కాదన్నారు. టీచర్ రిక్రూట్ అవసరం లేదని చెప్పడం కూడా విద్యా వ్యవస్థకు హానికరమని, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయులను నియమించాలని సూచించడం సరైన విధానం కాదని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *