టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలి

ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా కొనసాగించడమేంటి?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

తిరుమల, ప్రజాతంత్ర, జులై 11: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వెయ్యిమందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా వారిని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చిన బండి సంజయ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. కరీంనగర్‌లో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ’ఈరోజు తన జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాను.. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలి.. ప్రశాంత వాతావరణంలో జీవించాలి.. ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం చేదోడువాదోడుగా నిలవాలి..శక్తివంతమైన భారత్‌ నిర్మాణం కోసం, దేశాబివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకున్నాన‘ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అబివృద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులు కేటాయించి యుద్దప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందన్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు.. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. కాగా, బండి సంజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి జగదీశ్‌ ధన్కడ్‌, హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడి ్డసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *