– ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
– ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ నినాదంతో దిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, సభ
– పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్, ఇతర కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు
దిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 14: ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం సాయంత్రం దిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో భారీ మహా ధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా ఓట్ చోర్, గద్దీ ఛోడ్ అనే నినాదంతో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా తరలివచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మహా ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్ల కంటే ఎక్కువ సంతకాలను సేకరించామని పార్టీ తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ మహా ధర్నా అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ మహా ధర్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన పోరాటమని నేతలు పేర్కొన్నారు. ర్యాలీలో భారీ జన సమూహాన్ని పాల్గొనేలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ప్రదర్శించింది. ఈ ధర్నా ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కోరుతూ కాంగ్రెస్ గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ ధర్నా ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతత ఉండాలని డిమాండ్ చేస్తూ బలమైన సందేశాన్ని పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ర్యాలీ, బహిరంగ సభలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు పాల్గొన్నారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు హాజరయ్యారు.
కాంగ్రెస్ లక్ష్యం ప్రధాని మోదీని ‘తుదముట్టించడమే’ : బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘తుదముట్టించడం’ (తొలగించడం) కాంగ్రెస్ పార్టీ అసలు లక్ష్యమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ఆరోపణలు చేసింది. దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ, సభలో కొందరు కార్యకర్తలు ప్రధానికి వ్యతిరేకంగా వివాదాస్పద నినాదాలు చేయడంపై బీజేపీ మండిప డింది. ఓ వార్తా సంస్థ విడుదల చేసిన దృశ్యాలలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన పాలన ముగిసిపోతుందంటూ నినాదాలు చేసినట్లు ఉంది. ఈ వీడియోల ఆధారంగా బీజేపీ ఈ సంచలన ఆరోపణలు చేసింది. ‘కాబట్టి కాంగ్రెస్ అజెండా స్పష్టమైంది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్టు(ఎస్‌ఐఆర్) గురించి కాదు. ఇది ‘సంవిధాన్ పే వార్’ (రాజ్యాంగంపై దాడి).. ‘ఎస్‌ఐఆర్’ పేరుతో వారు ప్రధాని మోదీని ‘తుదముట్టించాలని’ అనుకుంటున్నారా? ఇటీవల, రాహుల్ గాంధీ కూడా ఎన్నికల సంఘాన్ని బెదిరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పీఎం మోదీని 150కి పైగా సార్లు దుర్భాషలాడిరది అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రజల ప్రియమైన నాయకుడిని ఈ విధంగా అగౌరవపరచడాన్ని ప్రజలు సహించరని మరో బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ‘నేను వ్యక్తిగతంగా ఈ నినాదాన్ని వినలేదు.. ఒకవేళ అలాంటి నినాదాలు నిజంగా చేసి ఉంటే కాంగ్రెస్ ఇంకా ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని తెలుస్తోంది అన్నారు.
అది ఫేక్ న్యూస్ : కాంగ్రెస్ ఖండన
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నాసిర్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. వీటిని ఆయన ఫేక్ న్యూస్‌గా అభివర్ణించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




