పంచాయతీ కార్యదర్శులకు ఊరట

– అంతర్ జిల్లా డెప్యుటేషన్‌కు అనుమతులు
– మంత్రి సీతక్క చొరవ ఫ‌లితం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేళ్లపాటు అంతర్ జిల్లా డెప్యుటేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక పాత్ర పోషించారు. జీవో 317 వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీరియస్‌గా తీసుకున్న మంత్రి పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. జీవో 317 వల్ల జరిగిన నష్టాలను సరిదిద్దేందుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల‌ మేరకు ప్రభుత్వం జీవో 190 జారీ చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా అంతర్ జిల్లా డిప్యూటేషన్ ప్రక్రియను ప్రారంభించిన తొలి శాఖగా పంచాయతీరాజ్ శాఖ నిలవడం మంత్రి సీతక్క కృషికి నిదర్శనం. ఖాళీలున్న ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా డెప్యుటేషన్లకు అనుమతులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో పరిపాలన బలోపేతం చేయడం, సిబ్బందికి న్యాయం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులకు గొప్ప ఉపశమనం లభించడంతోపాటు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలుకానున్నాయి.

ప్రభుత్వం, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు

ఈ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి వేగంగా పరిష్కరించిన ప్రభుత్వం, మంత్రి సీతక్కకు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికత కోల్పోయి కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొన్న పంచాయతీ కార్యదర్శులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగించింద్కన్నారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని న్యాయం చేసిన మంత్రి సీతక్కకు, శాఖ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *