బీఆర్ఎస్‌కు ఊరట!

ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం తాజా పరిణామం. ఇప్పటికే 80 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రెండు కోల్పోవడం వల్ల కలిగే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ, వరుస ఓటములు, ఫిరాయింపులు, కాంగ్రెస్ ఆకర్షణ రాజకీయాలతో వరుస దెబ్బలు తింటున్న బీఆర్ఎస్‌కు ఈ రెండు మున్సిపాలిటీల్లో విజయం ఊరట నిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. అదీకాకుండా ఈ రెండింటి ని కూడా బీఆర్ఎస్‌కు దక్కనీయకుండా చేయాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించిన మాట వాస్తవం. ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు కొందరు బీఆర్ఎస్‌కు మద్దతు పలకడం లేదా వోటింగ్ కు గైర్హాజరు కావడం వంటి రాజకీయ సమీకరణలు బీఆరఎస్ విజయానికి దోహదం చేశాయి. ఇక క్యాతన్‌పల్లి (మంచిర్యాల జిల్లా) కూడా అంతర్గత విభేదాలతో అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన రాజకీయం నేపథ్యంలో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి పీచర కావేరి ఛైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు దోహదం చేసింది. ఇక్కడ మొత్తం 28 మంది కౌన్సిలర్లలో మెజారిటీ సభ్యుల మద్దతు కావేరికి లభించడం విశేషం.  స్థానిక రాజకీయ సమీకరణల్లో భాగంగా కొందరు స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు బీఆర్ఎస్‌కు వోటు వేయడంతో ఆమె విజయం సాధించగలిగారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలోని మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం కావడం ఆయన ఆధిపత్యాన్ని సవాలు చేసినట్లయింది.
 ముఖ్యంగా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాల ద్వారా బీఆర్ఎస్ ఆధీనంలోని మున్సిపాలిటీలను ఒక్కటొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద షాక్ ఇచ్చాయి. ఇదేసమయంలో బీఆరఎస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి దోహదం చేశాయని చెప్పాలి.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి విపరీతంగా వలసలు కొనసాగుతున్న తరుణంలో, ఈ విజయాలు వాటిని అడ్డుకోవడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు ఎవరైనా పార్టీని వీడాలనుకునేవారు ఇప్పుడు పునరాలోచనలో పడటం ఖాయం. అదీకాకుండా అధికారపార్టీ అధికార బలాన్ని ఎదుర్కొనే క్రమంలో, బీఆరఎస్ అధిష్టానం, కౌన్సిలర్లను ఏకతాటిపైకి తెచ్చేందుకు అనుసరించిన వ్యూహం గట్టిగా పనిచేసిందనే చెప్పాలి. ఇది బీఆర్ఎస్ క్షేత్రస్థాయి వ్యూహ రచనకు గట్టి నిదర్శనం. ఈ విజయాల ద్వారా స్థానిక ప్రజలు లేదా ప్రతి నిధుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకున్నామని బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు అవకాశం చిక్కింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న మున్సిపాలిటీలను ఏదోవిధంగా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నంలలో బీఆర్ఎస్ రెండు రకాల వ్యూహాలను అమలు చేసింది. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ ఒంటరిగా కాకుండా సీపీఐతో జతకట్టింది. ఇక్కడ వున్న మొత్తం 22 వార్డుల్లో బీఆర్ఎస్ 10, సీపీఐ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపు సాధించాయి. ఇప్పుడు బీఆర్ఎస్, సీపీఐల మధ్య ఏర్పడిన అవగాహన కారణంగా మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్‌కు, వైస్ ఛైర్మన్ పదవి సీపీఐకి ఇవ్వడానికి రెండు పార్టీలు అవగాహనకు రావడంతో, కాంగ్రెస్‌ను కట్టడి చేయడానికి వీలైంది.ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చి బీజేపీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టగలిగింది. దీంతో ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ (టి. సుదర్శన్‌రెడ్డి), వైస్ ఛైర్మన్ పదవి (ముత్యాల శ్యామలా భార్గవ్) దక్కేలా రెండు పార్టీలు ఒక అవగాహనకు రావడంతో కాంగ్రెస్ దెబ్బతిన్నది.
 నిజానికి ఈ రెండు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు గత కొద్ది వారాలుగా వాయిదా పడుతూ వొస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లి, ఎన్నికలు సజావుగా సాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన ఒక కౌన్సిలర్ నిర్బంధంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎన్నికలు సజావుగా జరగడానికి దోహదం చేసింది. ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు గట్టి బందో బస్తు ఏర్పాటు చేయడం వల్ల ఎన్నికలు సజావుగా జరిగాయి. ఇబ్రహీంపట్నం లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలు వాయిదావేయాలని పట్టుపట్టినప్పటికీ, హై కోర్టు ఆదేశాల మేరకు అధికార్లు ఎన్నికలు నిర్వహించడం విశేషం.
క్యాతనపల్లి మున్సిపాలిటీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వొస్తుంది .
ఇక్కడి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్‌కు బలమైన అనుచరవర్గం ఉంది . ఆయన ఎంతగా రాజకీయం నడిపినా మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీఆర్ఎస్ చేజిక్కించుకోవడం వల్ల ఆయన ప్రాబల్యానికి గండిపడినట్టేనని చెబుతున్నారు. నిజానికి ఈ ఎన్నికలు గడ్డం వినోద్‌కుమార్, ఆయన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారంలో ఉన్నప్పటికీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడంలో వైఫల్యం చెందడం ఇప్పుడు వీరి నాయకత్వ పటిమను ప్రశ్నార్థకం చేస్తున్నది. అంతే కాదు మొదట్నుంచీ వీరు అనుసరించిన రాజకీయ వ్యూహాలు ఫలించలేదనేది సుస్పష్టం. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఈ విజయాన్ని తనకు అనుకూలం గా మలచుకునేందుకు యత్నించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల గడ్డం వినోద్‌కుమార్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఈ ఎన్నిక సాక్ష్యమంటూ ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే అధికారపార్టీకి, మున్సిపాలిటీ ప్రతిపక్షానికి దక్కడంతో ఇక్కడ రాజకీయంగా సమన్వయ లోపం ఏర్పడే పరిస్థితి నెలకొంది.
ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చేజారడం స్థానిక ఎమ్మెల్లే మల్‌రెడ్డి రంగారెడ్డికి రాజకీయ సవాలుగా మారింది. 2023లో భారీ మెజారిటీతో గెలిచిన ఆయనకు ఇప్పుడు మున్సిపాలిటీ విపక్షం చేతిలోకి వెళ్లిపోవడం మింగుడుపడని వ్యవహారం. అధికార పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, బీజేపీలు కలిసి దెబ్బతీయడం విశేషం. మల్‌రెడ్డి రంగారెడ్డి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీని కోల్పోవడం ఆయన బేరసారాలాడే శక్తిని తగ్గించడం ఖాయం. ఇక్కడ ఎమ్మెల్యే వ్యూహాలను చిత్తు చేయడానికి బీఆర్ఎస్ ఏకంగా 55 రోజుల పాటు కౌన్సిలర్లను క్యాంపుల్లో ఉంచి విజయం సాధించడం విశేషం. ఈ ఫలితాల నేపథ్యంలో మంత్రిపదవి మాట అట్లావుంచి ప్రజల్లో తన ఇమేజ్‌ను మరింత బలపరచుకోవడానికి మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *