– హర్షం వ్యక్తం చేసిన మానవ హక్కుల వేదిక
– నాలుగు నెలలకోసారి అర్హుల జాబితా రూపొందించాలి
– ప్రభుత్వాన్ని కోరిన సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో విడుదల కోసం 102 మంది జీవిత ఖైదీలు (వారిలో ఆరుగురు మహిళలు) ఉన్నారని, ఆ ఫైల్ తుది ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలుస్తున్నది. ఈ నిర్ణయంపై ఖైదీల కుటుంబ సభ్యులు, మానవ హక్కుల వేదిక నేతలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గత ఏడాది అక్టోబర్ 27న జారీ చేసిన జీవో నెం.126 (హోం శాఖ -సర్వీసెస్-5) ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి ఇందుకోసమే ఏర్పడ్డ సమీక్ష కమిటీ ముందు ఉంచాలని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని వారు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఫేజ్-3 (1 ఫిబ్రవరి నుండి 15 సెప్టెంబర్ 2025 వరకు) పూర్తయిన నేపథ్యంలో ఫేజ్-1 (1 జనవరి నుండి 31 మార్చి)కు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆమోదానికి పంపిన 102 మంది జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, పై జీవోలో పేర్కొన్న విధంగా ప్రతి నాలుగు నెలలకు జాబితాల సిద్ధత, సమీక్ష ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని వారు కోరారు. ప్రస్తుతం సిద్ధం అవుతున్న తదుపరి జాబితాలో ఉన్న అర్హులైన ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి పరిశీలించాలన్నారు. ప్రభుత్వం న్యాయం, సంస్కరణ, మానవతా దృక్పథాన్ని ప్రదర్శించి జీవిత ఖైదీల విడుదల ప్రక్రియ కొంసాగిస్తుందని ఆశిస్తున్నామని మానవ హక్కుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు ఎస్.జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్యలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




