– రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టాం
-2.29 కోట్ల సర్వే నెంబర్లకు భూధార్ నెంబర్లు
-373 నక్షా గ్రామాల్లో రీసర్వే
– భూసమస్యలపై త్వరలో ట్రిబ్యునల్ ఏర్పాటు
– ఒకే ఛత్రం కిందికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్
– మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : రాష్ట్రంలో రెండేళ్లలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజల సౌలభ్యం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకల్లా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని, ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబం ధించి ఇప్పటికే ఎన్ఎసీ తగు కసరత్తు చేస్తోందని వివరించారు. నక్షాలు లేని 413 గ్రామాల్లో సరిహద్దుల, భూధార్ నెంబర్ల కేటాయింపు వంటి ప్రధాన అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి పని పూర్తి చేశామని, ఈ గ్రామాలకు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 408 గ్రామాల్లో పట్టణ ప్రాంతాలు మినహా 373 గ్రామాల్లో రెండవ విడత కింద సర్వే నిర్వహిస్తామన్నారు. మూడవ విడతగా అన్నిజిల్లాల్లోనూ జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూదార్ కార్డులు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతవరకు భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో అర్హత కలిగిన వాటిని జనవరి నెలాఖరుకల్లా పరిష్కరిస్తామని, ఆ తర్వాత ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు ప్రతి పౌరుడికి మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్ధలో సంస్కరణలు చేపట్టి అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణీ దరఖాస్తులకు మోక్షం కల్పించాం. అధికారం చేపట్టిననాటికి 2.45 లక్షల ధరణీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత మరో నాలుగు లక్షల దరఖాస్తులు రాగా వీటినీ పరిష్కరించి ప్రజల సంతృప్తికి తొలి అడుగు వేశాం. ధరణి పోర్టల్ బాధ్యతలను ప్రభుత్వ సంస్ధలకు అప్పగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ధరణి పోర్టల్ నిర్వహణను టెరాసిస్ అనే విదేశీ సంస్ధ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్ఐసికి అప్పగించామని, ఈ నిర్ణయం వల్ల రైతుల కోటీ 56 లక్షల ఎకరాల భూమి వివరాలు ఇప్పుడు సురక్షితమైన స్వదేశీ సంస్ధ పరిధిలోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సరళీకృతం చేయడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీగా భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులను తీసుకున్నారని గుర్తుచేశారు. ఏప్రిల్ 17నుంచి జూన్ 20వ తేదీ వరకు మూడు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించగా తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ నోటీసులు జారీ చేసి పరిష్కరిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వస్తే రెవెన్యూ వ్యవస్ధను పునరుద్దరిస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకొని 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ వారీగా విభజించి జీపీవోలను నియమించామన్నారు. అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకునే ప్రక్రియలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీకి చర్యలు చేపట్టడంతోపాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. భూ విస్తీర్ణాన్నిబట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6గురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నాం. ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేశాం. డిసెంబర్ నుంచి మరో మూడు వేలమంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్లకింద నిరీక్షించే పరిస్ధితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెరదించాం. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు దశల్లో ఈ స్లాట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడమేగాక ఆధార్ -ఈ సంతకం కూడా అమలు చేసి ప్రజల డబ్బు, సమయం ఆదా చేశామన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కార్పొరేట్స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి రాజీవ్గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





