పేదలకు మరింత మేలు చేసేందుకే సంస్కరణలు

– ఆ దారిలోనే వీబీజీ రామ్‌ జీ చట్టం
– పనులు ఎప్పుడు జరపాలనేది రాష్ట్రాల ఇష్టం
– రాష్ట్రాలపై భారం ఏమీ ఉండదు
– ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలంటే పరిమితులు
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12: అనేక సంస్కరణలు, మార్పులతో దేశానికి, పేద ప్రజలకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలనే లక్ష్యంతో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) (వీబీజీ రామ్‌ జీ) యాక్ట్‌-2025ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కేంద్ర, బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతోపాటు వారి జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తెచ్చిన ఈ పథకంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా వచ్చిన అనుభవాలు, ఫలితాలను సూక్ష్మంగా పరిశీలించి, ప్రజలకు, దేశానికి మరింత ఉపయోగపడేలా అవసరమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. జీఎస్టీ కూడా అందులో ఒక ముఖ్యమైన సంస్కరణ అని, పన్ను వ్యవస్థలో, బడ్జెట్‌ విధానంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకంలో టెక్నాలజీని వినియోగించి జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేశామని, రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. పని అడిగిన ప్రతి కూలీకి తప్పనిసరిగా పని కల్పించాల్సిందే. ఏ కారణంతోనైనా పని కల్పించలేకపోతే వారికి పరిహారం చెల్లించాల్సిందే అనే నిబంధనను పొందుపరిచామన్నారు. పని పూర్తయిన తర్వాత కూలీల ఖాతాల్లో సకాలంలో వేతనాలు జమ కాకపోతే ఆలస్యానికి సంబంధించి జరనిమానా విధించే విధానాన్ని కూడా ఈ చట్టంలో తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఈ పథకం అమలులో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు పూర్తి బాధ్యత ఉండే విధంగా అనేక మార్పులు తీసుకొచ్చామన్నా రు. ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వడానికి అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన నిధులను 9 శాతానికి పెంచాం. దీని ద్వారా పథక నిర్వహణకు అవసరమైన సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. జియో-ట్యాగింగ్‌ విధానం ద్వారా ఎక్కడెక్కడ పనులు జరిగాయో ఆ పనులపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. ఇది కేవలం గుంతలు తవ్వే పథకం కాదు. గ్రామాలను, దేశాన్ని అభివృద్ధి చేసే పథకం, ప్రతి గ్రామీణ కుటుంబానికి అదనపు ఆదాయం కల్పించే పథకం అని వివరించారు. రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని అంటున్నారు. . కానీ రాష్ట్రాలపై మాత్రమే కాదు.. కేంద్రం కూడా అదనపు భారం మోస్తోంది. ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా రూ.17 వేల కోట్లు అదనంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.340 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు అందించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జోడించేది వేరే విషయం.

పనులు ఎప్పుడు చేయాలన్నది రాష్ట్రాల ఇష్టమే

వ్యవసాయ పనుల సీజన్‌ ఎప్పుడు ఉంది, ఆ సమయంలో ఈ పథకాన్ని అమలు చేయాలా వద్దా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల అధికారంలోనే ఉంటుందని తెలిపారు. పని కావాలని నమోదు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లో పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా కూడా చట్టంలో పొందుపరిచాం.. వేతనాలు ఆలస్యమైతే రోజుకు 5 శాతం పరిహారం చెల్లించే నిబంధనను కూడా తీసుకొచ్చాం.. ప్రతి రైతు కూలీకి, ప్రతి కార్మికుడికి డబ్బులు నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్‌లోకే వస్తాయి అని వెల్లడిరచారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో దళారులు, రాజకీయ నాయకులు, మధ్యవర్తులు ఈ పథకం పేరుతో భారీగా దోపిడీ చేసేవారు. నకిలీ జాబ్‌ కార్డులు తయారు చేసి డబ్బులు వారి జేబుల్లోకి వేసుకునేవారు.. ఆ దోపిడీని అరికట్టేందుకు డిజిటల్‌ లావాదేవీల ద్వారా కూలీల అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా డబ్బులు చేరేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. గతంలో తెలంగాణలో కూలీలకు వేతనాలు రెండుమూడు నెలలు ఆలస్యంగా వచ్చేవి. దాంతో వారు అధికారుల చుట్టూ, దళారీల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి ఉండకుండా ఈ చట్టంలో అవసరమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. మహాత్మా గాంధీ పేరు మార్చారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి అంబేద్కర్‌ ఆవాస్‌ యోజనను తాము తీసుకొచ్చాం. తర్వాత ప్రభుత్వం పేరు మార్చింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్‌ పేరు పెట్టాం.. తర్వాత మార్చారు. ఇవి అసలు సమస్యలు కావు. పథకం సక్సెస్‌ అవుతుందా, పేదలకు న్యాయం జరుగుతుందా, సమర్థవంతంగా అమలవుతుందా అన్నదే అసలు ప్రశ్న అని అన్నారు. గత ప్రభుత్వాల అనుభవాలు, అధ్యయనాల ఆధారంగా పథకాల్లో మార్పులు చేసి మరింత సమర్థవంతంగా అమలు చేయాలి.

ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలంటే పరిమితులు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ని అడగడంలో తప్పేమీ లేదు. తాము కూడా అడుగుతాం. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం రాష్ట్ర విభజన చట్టం (బైఫర్కేషన్‌ యాక్ట్‌) ఆధారంగా జరిగింది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికి స్పష్టమైన చట్టపరమైన పరిమితులు ఉన్నాయి. తాను గతంలో టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ట్రైబల్‌ మినిస్ట్రీ నుంచీ నిధులు ఇచ్చాం. ఈసారి కూడా రెండు మంత్రిత్వ శాఖల నుంచీ సహకారం అందిస్తాం అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్‌.గౌతమ్‌ రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, పార్టీ సీనియర్‌ నాయకులు డా.ఎస్‌.ప్రకాష్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, వకుళాభరణం, తదితరులు పాల్గొన్నారు.

దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

భారతదేశ ప్రజలందరికీ కేంద్ర మంత్రి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో ముడిపడి, రైతు జీవితాన్ని ప్రతిబింబించే ఈ పండుగకు ప్రత్యేకమైన సాంస్కృతిక విలువ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *