‌దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు ప‌డ్డారు

– కోటి రూపాయల కలశం తస్కరణ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ‌దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు పడ్డారు. ఏకంగా కోటి విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కూడా ఈ మత ఆచారానికి వొచ్చిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. ఆయనను స్వాగతిస్తున్న సమయంలో కలశం కనబడలేదు. వ్యాపారవేత్త సుధీర్‌ ‌జైన్‌ ‌ప్రతిరోజూ పూజ కోసం ఆ కలశాన్ని తీసుకు వచ్చేవారని పోలీసులు తెలిపారు. కలశాన్ని దొంగిలించిన నిందితుడి కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఎవ‌రూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజా సామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. త్వరలోనే అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఎర్రకోట సముదాయంలోని జైన సమాజం ఆధ్వర్యంలో కలశ పూజ ఆచారం ఆగస్ట్ 15 ‌నుండి సెప్టెంబర్‌ 9 ‌వరకు కొనసాగుతుంది. 2వ తేదీన కార్యక్రమం అనంతరం పూజ కోసం తీసుకువచ్చిన 760 గ్రాములు బంగారు కలశంతోపాటు వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్‌ కుమార్‌ జైన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవ్వడంతో తాము పక్కకు వెళ్లామని, అంతలోనే ఈ దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగిలించిన కలశం చాలా విలువైనదని, రూ.కోటి పైగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇంత విలువైన కలశం దొంగతనం కలకలం సృష్టించింది. దీనికి ముందు కూడా ఎర్రకోట వద్ద భద్రతా లోపం బయట పడింది. ఆగస్ట్ 2‌న ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు బాంబును గుర్తించలేకపోయినప్పుడు ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 2‌న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్స్‌లో భాగంగా మాక్‌ ‌డ్రిల్‌ ‌కోసం స్పెషల్‌ ‌సెల్‌ ‌బృందం సాధారణ దుస్తుల్లో వొచ్చింది. వారు తమతోపాటు నకిలీ బాంబును తీసుకుని ఎర్రకోటలోకి ప్రవేశించారు. కానీ ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు ఆ బాంబును గుర్తించలేకపోయారు. అప్పుడు నిర్లక్ష్యం కారణంగా పోలీసులను కూడా సస్పెండ్‌ ‌చేశారు. ఇప్పుడు దొంగతనం సంఘటన వెలుగులోకి వచ్చింది. కలశాలను దొంగలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *