– గ‌త 25 ఏళ్ల‌లో ఇదే రికార్డు
– ధాన్యం కొనుగోళ్ల వ‌ల్ల 14.20ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది
– అగ్ర‌స్థానంలో నిజామాబాద్‌, న‌ల్గొండ జిల్లాలు
– ప్ర‌జాపంపిణీ ద్వారా మ‌రిన్ని నిత్యావ‌స‌ర స‌రుకులు
– మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ధాన్యం దిగుబడిలోనే కాక ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు చేసిన‌ ధాన్యం దేశ చరిత్రలోనే రాష్ట్రం ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత పాతికేళ్ల‌ వ్యవధిలో ఇదే అత్యధిక రికార్డ్ అని చెప్పారు. 2025-26 రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకై పౌర సరఫరా శాఖ రూపొందించిన ప్రణాళికలపై బేగంపేట ఐఏఎస్ఆ ఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో గురువారం జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల‌లో అనుసరించిన విధానాల ఫలితమే ధాన్యం దిగుబడి, కొనుగోలులోనూ సంచలనాత్మక రికార్డ్ నమోదు చేసుకుందని ఆయన చెప్పారు. పౌరసరఫరాల శాఖ‌, నీటిపారుదల, వ్యవసాయ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకోవడంతోపాటు తెలంగాణ రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం సాధించామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత రాష్ట్రానికి దక్కిందన్నారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్దస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు దేశంలోని మరే ఇతర రాష్ట్రాలలో లేవని ఆయన తెలిపారు. 2020-21లో నమోదు అయిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రికార్డ్ ను అధిగమించి తాజాగా జరిగిన ఖరీఫ్ సీజన్ లో71.64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించిందన్నారు. మద్దతు ధరతోపాటు సన్నాలకు మొట్టమొదటి సారిగా తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో కలిపి మొత్తం రూ.18,532.98 కోట్లను 14.20 లక్షల మంది రైతులకు చెల్లించామన్నారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 8,548 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతోపాటు కొనుగోలు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా కొనుగోలు ప్రక్రియ ముగిసిందని ఆయన వివరించారు. అందుకు పౌర సరఫరాల శాఖ సిబ్బంది పని తీరును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అధిక దిగుబడులతోపాటు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చెసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థతోపాటు ప్రజాపంపిణీ వ్యవస్థ కు సరఫరా చేయడంతోపాటు తెలంగాణ బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి విదేశాలకు ఎగుమతి చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని పండించేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాల ఆవశ్యకతను ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ కు బియ్యాన్ని ఎగుమతి చెసేందుకు కుడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
రూ.38,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ
  ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.38,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం కుడా ఒక అరుదైన రికార్డే అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సన్నబియ్యం 3.17 కోట్ల మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని,అంటే రాష్ట్ర జనాభాలో 85% లబ్ది పొందుతున్నారని ఆయన వివరించారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుకు నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీ మీద రూ.13,650 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ధాన్యాన్ని నిల్వచేసే గోదాముల సామర్ధ్యం 29 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పరిమితమైందని,ఈ గోదాములను భారత ఆహార సంస్థ,రాష్ట్ర గోదాముల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతుందన్నారు. అయితే నాణ్యతా లోపాలతో నిల్వ ఉంచిన బియ్యం చేడి పోయి రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో పాటు ప్రైవైట్ సంస్థల భాగస్వామ్యం తో ధాన్యం నిలువ ఉంచే గోదాములను సైలో పద్దతిలో ఆధునికరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు.. ఆధునికీకరణతో తేమ శాతం నియంత్రణలో ఉండడంతో పాటు నష్టానివారణ చర్యలు చేపట్టవచ్చన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల నుండి వలస వచ్చే కార్మికులపై రాష్ట్రంలో రైస్ మిల్లులు ఆధారపడుతున్నాయని, ఇటీవల ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వలస వచ్చిన కార్మికులు వారివారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయని చెప్పారు. అటువంటి పరిస్థితి తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు స్థిరమైన కార్మిక వ్యవస్థ ఏర్పాటు ఆవశ్యకతను ఆయన సూచించారు. అదే విధంగా నిబంధనలు పాటించిన మిల్లర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని, తప్పిదాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. డిఫాల్ట్ అయిన మిల్లులకు ధాన్యం కేటాయింపు ప్రసక్తే లేదని, పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనున్నారు. పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి కనుగుణంగా ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మిల్లుల పరిశ్రమని ప్రోత్సహించే విధంగా విధివిదానలను త్వరలో ప్రకటిస్తామ‌న్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా మరిన్ని నిత్యావసర సరుకుల సరఫరాకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆయన చెప్పారు.
————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.