– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
– ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ
– మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం
నిర్మల్/ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్‌లో ఆలయ రీడెవలప్‌మెంట్ నమూనాలోని ఒక భాగాన్ని ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. దక్షిణ భారత దేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పునఃనిర్మాణంతో కొత్త శోభను సంతరించుకోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టకోనుంది. వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. పునః నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు,కొండా సురేఖ, ఎంపి గోడం నగేశ్, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్దానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారని ప్రశస్తి. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది. జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం.. ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు.. వారి సూచనలకనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. భక్తుల సంఖ్య.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు.. గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభంకానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్ట నున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్‌కు గోదావరి నీరు పారిస్తా 
గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లు పారిస్తుందని చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, ఈ జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి పాలన బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చవద్దని కేంద్రం చెప్పింది. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే హద్దులు మారుస్తాం. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. గత పాలకులు తుమ్మిడిహట్టిని పక్కనపెట్టి ఆదిలాబాద్‌కు అన్యాయం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ను నిర్మించి ఆదిలాబాద్‌కు నీళ్లిస్తాం’ అని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆదిలాబాద్ దూరంగా ఉంది. కేసులు, అక్రమ నిర్భందాలకు వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చాం. విపక్ష ఎమ్మెల్యేలను శత్రువులు గా కాంగ్రెస్ ప్రభుత్వం చూడదు. బీజేపీ, బీఆర్‌ఎస్ మాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలను కూడా పిలిచాం. గతంలో ముఖ్యమంత్రి వస్తుంటే విపక్ష నేతలను అరెస్టులు, గృహనిర్భంధాలు చేసేవారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా నిధులు ఇస్తున్నాం. మేం పార్టీలు చూడకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలు చూడటం లేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు.. కానీ మేం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే రూ.5,400 కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. సన్నబియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన గత పాలకులకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు. కుమురంభీం వంటి ఆదివాసీ వీరులు నిజాం నిరంకుశత్వంపై పోరాడారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆధునిక విద్య, వైద్యం వంటి సదుపాయాలు ఇంకా దక్కలేదు. ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే ప్రభుత్వం కాదు ఇది. రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో మరొకటి లేదు. యువత మత్తుబాట వదిలి.. మైదానాల బాట పట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి అనే ఆశయంతో ఈ ప్రభుత్వం పని చేస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు,కొండా సురేఖ, ఎంపి గోడం నగేశ్, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





