– కేంద్ర మంత్రుల రాకతో కల సాకారమవుతుందని ఆశ
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క-సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు జాతరను దర్శించుకోవడంతో ఈ అంశం త్వరలోనే సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మక్క-సారక్క జాతరను గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, మరో కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. ఈ మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న అధికారులు, సిబ్బంది, సహకరించిన మీడియా మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
90 రోజుల్లోనే ఆలయ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు పూర్తి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో కేవలం 90 రోజుల్లోనే ఆలయ అభివృద్ధి పనులు, మౌలిక వసతులు పూర్తి చేసినట్లు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతరను ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా విస్తృత ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జాతర ప్రశాంతంగా, సవ్యంగా కొనసాగుతోందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, ఇతర జిల్లాల నుంచి వచ్చి సేవలందించిన సిబ్బంది, సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న మీడియా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గద్దెల పునర్నిర్మాణం సహా మౌలిక సదుపాయాల పనులు నిర్ణీత కాలంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంనకు విజ్ఞప్తి చేసినట్లు, అలాగే జాతర నిర్వహణకు మరింత ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కోట్లాదిమంది భక్తులు హాజరవుతున్న ఈ మహాజాతరలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, మీడియా మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





