యూనివ‌ర్సిటీల్లో రియ‌ల్ దందా

– విద్యా వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయొద్దు
– అభివృద్ధి అంటే భ‌వ‌నాలు క‌ట్ట‌డం కాదు
– విద్యా కేంద్రాల‌ను కాపాడుకోవాలి
– యూనివ‌ర్సిటీల స్వ‌యంప్ర‌తిప‌త్తిపై దాడి త‌గ‌దు
– బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హెచ్చ‌రిక‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ దందా చేస్తూ భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడం అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మొన్న ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం లోని 60 ఎకరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఎంతో విలువైన పరిశోధనా సంపద నేలమట్టమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టుపెట్టి విధ్వంసం చేశారు. దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా, మూగ జీవాల మనుగడకే ముప్పు వాటిల్లింది. ఇప్పుడు తాజాగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్ను పడింది. అదే పద్ధతిలో ఇక్కడి భూములను కూడా లాక్కోవాలని చూస్తోంద‌ని ఆరోపించారు. ఇవి యాధృచ్చికంగా జరిగిన సంఘటనలు కావు. విద్యా వ్యవస్థపై, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విద్యార్థులన్నా, పరిశోధనలన్నా, పర్యావరణమన్నా ఎందుకింత చిన్నచూపని ప్ర‌శ్నించారు.  భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరి పోయాల్సిన చోట.. ఇలా భూములను లాక్కోవడం దేనికి సంకేతం? విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి ఉన్న విజ్ఞాన కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలి. యూనివర్సిటీల భూములను వాటికే వదిలేయాలి. లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చ‌రించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *