పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి

– స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నాం
– నివాస ప్రాంతాల్లోని పరిశ్రమలతో భద్రత, ఆరోగ్య ప్రమాదాలు
– గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్ట్రంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు
– త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులు ప్రారంభం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ ముందుకు వెళ్తున్నదన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం (ఎంసీహెచఆర్‌డీ)లో ‘గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణ’ అంశంపై గురువారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం స్వచ్ఛమైన గాలి అనేది ఈ సదస్సు స్పష్టమైన ఉన్నత లక్ష్యం అని చెప్పారు. నేడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని, హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగిందని, ఈ అభివృద్ధి మనకు గర్వకారణం అని అన్నారు. అదే సమయంలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను ఎదురెదురుగా నిలబెట్టలేం.. అవి చేతులు కలిపి ముందుకు నడవాలి అని డిప్యూటీ సీఎం అన్నారు. సుస్థిర అభివృద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై కూడా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని వివరించారు. ఎందుకంటే శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదు.. అది కేవలం ఆలస్యమైన నష్టం మాత్రమే అని వివరించారు. గాలి నాణ్యత ఒక పర్యావరణ సూచీ మాత్రమే కాదు.. అది ప్రజారోగ్య సూచీ.. ఉత్పాదకత సూచీ.. ఆర్థిక సూచీ కూడా అని చెప్పారు. 2024 ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట’ సహా ప్రపంచస్థాయి అధ్యయనాలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయన్నారు. నేడు అధిక రక్తపోటు తర్వాత ప్రపంచంలో మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణంగా మారిందని, ఏటా 80 లక్షలకుపైగా అకాల మరణాలకు ఇది కారణమవుతోందని పేర్కొన్నారు. ఇది మన పిల్లలను, వృద్ధులను, పనిచేసే జనాభాను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నరు. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం గాలి కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందన్నారు. అందుకే శుభ్రమైన గాలి గురించి మాట్లాడినప్పుడు మనం మనుషుల జీవితాల గురించి, ఆర్థిక బలంపై, సామాజిక శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాధారితమైన, శాస్త్రీయమైన విధానాన్ని అనుసరిస్తోందని, అందులో మొదటి అంశం పర్యవేక్షణ అని తెలిపారు. మా నమ్మకం చాలా స్పష్టం అన్నారు. 2024లో గాలి నాణ్యత పర్యవేక్షణ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశాం. దీని ద్వారా రియల్‌టైమ్, విశ్వసనీయ డేటా అందుతుందని తెలిపారు.
రెండోది ప్రణాళిక
2025లో రాష్ట్ర గాలి శుభ్రత కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. వాహనాలు, రోడ్డు ధూళి, నిర్మాణాలు, పరిశ్రమలు, బహిరంగ దహనం వంటి ప్రధాన కాలుష్య మూలాలను ఈ ప్రణాళిక పరిష్కరిస్తోంది. ఇది ఇప్పటికే అమలులో ఉందని తెలిపారు.
మూడోది స్వచ్ఛమైన రవాణా
ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అందిస్తున్నాం. ఈ-బస్సులు, మెట్రో విస్తరణ ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులు నిర్మిస్తున్నాం. పాత, కాలుష్యకర వాహనాలను తొలగించేందుకు రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించాం అని వివరించారు.
నాలుగోది పరిశ్రమల నియంత్రణ
పరిశ్రమల ఉద్గారాలను నిరంతర పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా కాలుష్య నియంత్రణ మండలి సర్వర్లకు అనుసంధా నించాం, శుభ్రమైన ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం, నియమావళి అమలును కఠినతరం చేస్తున్నాం అని వివరించారు.
ఐదవది పునరుత్పాదక శక్తి
2025 పునరుత్పాదక శక్తి విధానం ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించాం. సౌర, గాలి, గ్రీన్ హైడ్రజన్ ద్వారా.ఇది కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందనీ డిప్యూటీ సీఎం తెలిపారు.

నివాస ప్రాంతంలో జరిగే పరిశ్రమల ప్రమాదం విపత్తుగా మారవచ్చు

కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు సుమారు 32 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయని ప్రజెంటేషన్ వెల్లడించిందని తెలిపారు. నేరుగా వచ్చే ధూళి కణాలపై నియంత్రణ ఉన్నప్పటికీ, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి ఇతర కాలుష్యాలపై మరింత దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఉదాహరణగా మనం చూశాం. ఒకప్పుడు నగర చివరన ఉన్న పరిశ్రమలు నేడు నివాస ప్రాంతాల మధ్య ఉన్నాయి.. ఇది రాష్ట్ర ప్రజల భద్రత, ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రమాదాలను సృష్టిస్తుంది అని పేర్కొన్నారు. నివాస ప్రాంతంలో జరిగే పరిశ్రమల ప్రమాదం పెద్ద విపత్తుగా మారవచ్చునన్నారు. కావున పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ, జోనింగ్ సంస్కరణలు, మెరుగైన భూ వినియోగ ప్రణాళికలను తీవ్రంగా పరిశీలించాలన్నారు. నగర వృద్ధి ప్రణాళికతో జరగాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే గాలి నాణ్యత డ్యాష్‌బోర్డును త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కాలుష్య ఫిర్యాదులకు వేగంగా స్పందించేందుకు రెండు జీహెచఎంసీ జోన్లలో ప్రత్యేక చర్యల బృందాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వాటిని విస్తరిస్తామని చెప్పారు. ఎంత నిబద్ధత కలిగిన ప్రభుత్వం అయినా ఒంటరిగా శుభ్రమైన గాలిని అందించలేదు అన్నారు. శుభ్రమైన గాలికి పౌరులతో, పరిశ్రమలతో, సంస్థలతో పౌర సమాజంతో భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. స్వచ్ఛమైన గాలిని ఏర్పాటు చేసుకోవడానికి రోజువారీ చిన్న నిర్ణయాలు చాలా ముఖ్యమన్నారు. ప్రజా రవాణా వినియోగించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, చెత్తను కాల్చకుండా ఉండడం, పచ్చ విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణ ప్రారంభమవుతుంది

పర్యావరణ పరిరక్షణ ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తాము శుభ్రమైన గాలిని కేవలం పరిపాలనా బాధ్యతగా చూడటం లేదని, అది ఒక నైతిక బాధ్యతగా చూస్తున్నామని చెప్పారు. మన పిల్లల పట్ల, భవిష్యత్ తరాల పట్ల, చరిత్ర పట్ల బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రాన్ని ఎలా ఉంచాలనుకుంటున్నాం.. కాలుష్యంతో నిండిన ఊపిరితిత్తులు ఉన్న సంపన్న రాష్ట్రంగానా లేక ఆరోగ్యవంతమైన పౌరులు ఉన్న ఆధునిక రాష్ట్రంగా అని ప్రశ్నిస్తూనే తమ సమాధానం స్పష్టం అని అన్నారు. ఈ సదస్సు జాతీయ, అంతర్జాతీయ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొచ్చిందంటూ వారి అనుభవం, డేటా, ఆవిష్కరణలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి అన్నారు. సంబంధిత శాఖలన్నీ ఈ ఉత్తమ విధానాలను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరుతున్నానన్నారు. జ్ఞానాన్ని విధానంగా మార్చుదాం.. విధానాన్ని చర్యగా మార్చుదాం… చర్యను ఫలితంగా మార్చుదాం అని పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, శుభ్రమైన గాలి కలిసి ముందుకు సాగే తెలంగాణను నిర్మిద్దాం.. అదే మన నిజమైన వారసత్వం అని డిప్యూటీ సీఎం అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *