– పంపిణీ కోసం సుమారు రూ. 2,650 కోట్లు అవసరం
– నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద అందించే ’రైతు భరోసా’ రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేస్తోంది. రెండో విడత పంపిణీ కోసం సుమారు రూ.2,650 కోట్ల భారీ మొత్తాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు పూర్తయిన వెంటనే ఈ నిధులను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మొత్తం రూ. 9,000 కోట్ల అవసరం ఉన్న ఈ పథకాన్ని నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం మూడు విడతల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎకరంలోపు ఉన్న రైతులకు మొదటి విడత నిధులు అందగా, ఇప్పుడు ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు ఈ నెల రెండో వారంలో నగదు జమ కానుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఈ నెలాఖరు కల్లా వారి వాటా నిధులు అందుతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, ప్రతి ఎకరాకు సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే ఈ నగదు బదిలీ కానుండటంతో ఎక్కడా జాప్యం లేకుండా రైతులకు మేలు జరుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




