-క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: నీళ్లు, నిధులకు సంబంధించి కెసీఆర్ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామని ప్రజా భవన్ లో వుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత అభ్యర్థులుంకూడా దొరకక ఫ్రస్ట్రేషన్ లో కొందరు విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని సూచన చేశానన్నారు. క్లబ్బుల్లో పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేసుకుందామని కోరానన్నారు. కానీ సడన్ గా ఆయనగారు వచ్చి ఏదేదో మాట్లాడారు. అలాంటి మాటలకు నేను ఎలా సమాధానం చెబుతానో అందరికీ తెలుసు.. కానీ వారిలా ఆ స్థాయికి నేను దిగజారలేనన్నారు. ఆనాడు కె.సి.ఆర్. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన తరువాతే మిగిలిన జలాలపై చర్చిస్తామని మాట్లాడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి నీటిని తరలించుకుంటే ఏపీకి అవకాశం ఉండేది కాదు. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే కృష్ణా నీటిని ఒడిసిపట్టుకుని ఉంటే రాయలసీమకు నీరు తరలించుకు వెళ్ళే అవకాశం ఉండేది కాదన్నారు. నీళ్లను తీసుకెళ్లడం ద్వారా పవర్ ప్రాజెక్టు డీ ఫంక్ట్ అవడంతో విద్యుత్ పరంగానూ తెలంగాణకు నష్టం జరిగిందని వివరించారు. పాలమూరు రంగారెడ్డిలో 2 టీఎంసీలను తరలించాల్సి ఉంటే 1 టీఎంసీకి తగ్గించారన్నారు.పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతో రావాల్సిన హక్కులు రాకపోగా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కృష్ణా లో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రేట్లు కెసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. రావాల్సిన నీటి కోసం మేం పోరాటం చేస్తుంటే.. ఇవాళ మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గోదావరి నదిపై ప్రాణహిత చేవెళ్ల 2007-08 లో మొదలు పెట్టారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఆయకట్టు తొలగించారు. 24,25,26 ప్యాకేజీలను తొలగించారు. మొత్తం 4 లక్షల ఎకరాల ఆయకట్టును తొలగించారు. కృష్ణా బేసిన్ కు అనుకుని ఉన్న గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు తరలించకుండా ఎందుకు ఆయకట్టు తొలగించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే ఒక ఎకరాకు నీళ్లివ్వడానికి చేసిన ఖర్చు రూ. 93 వేలు. కేసీఆర్ 15 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే.. ఒక ఎకరాకు నీళ్లివ్వడానికి వాళ్లు చేసిన ఖర్చు రూ.11లక్షలు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామన్నారు. మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పడు స్పీకర్ కు లేఖ రాసినా మేం సిద్ధమన్నారు. మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదామన్నారు. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా, ఎలాంటి గందరగోళం లేకుండా.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదన్నారు. కెసిఆర్ గారు మీరు రండి అర్ధవంతమైన చర్చ పెడదామన్నారు. మీ ఆరోగ్యం సహకరించకపోతే.. తారీఖు చెప్పండి.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేను మంత్రుల బృందాన్ని పంపుతా.. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. కాదు కూడదు నేనుకూడా రావాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేనుకూడా సిద్ధమన్నారు. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టంతెలంగాణ హక్కుల విషయాలలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రూ. 42 వేల కోట్లు ఖర్చు పెడితే గోదావరిపై 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. టిఆర్‌ఎస్ నేతలు గోదావరి రీ డిజైన్ పేరుతో1.45 లక్షలు ఖర్చుచేసి అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదన్నారు. కృష్ణా నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు టిఆర్‌ఎస్ పూర్తి చేస్తే కృష్ణా జలాల సమస్య వచ్చేది కాదన్నారు. కృష్ణానదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ఆ తర్వాత వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇంత ఖర్చు చేసిన గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీపాద, మిడ్ మానేరు, కాకతీయ కాలువల నుంచి గోదావరి నీరు పారుతున్నదన్నారు. టిఆర్‌ఎస్ పెద్దలు ఒక్క కాలేశ్వరం పైనే లక్ష కోట్లు తిని… నిధులు ఖర్చు చేశారు, నీళ్లు మాత్రం ఇవ్వలేకపోయారని ఆరోపించారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే బనకచర్ల సమస్య వచ్చేది కాదన్నారు. సముద్రంలో కలిసే, చివరిలో ఉన్న గోదావరి నీళ్లతో బనకచర్ల నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ట్రిబ్యునల్ ముందు వాదనలకు వెళ్లినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటే వాటికే కేటాయింపులు చేస్తారు. గోదావరిపై ఎగువ భాగాన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించక పోతే చివర్లో ఉన్నప్పటికీ బనకచర్లకు ట్రిబ్యునల్ అధికారికంగా జలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. తద్వారా ఎగువన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు నీటి హక్కులు కోల్పోతామన్నారు. టిఆర్‌ఎస్ చేస్తున్న గోబెల్ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకు, రిటైర్డ్ ఇంజనీర్లకు ప్రదర్శించి చూపాలని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో పెట్టాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.





