– రాయదుర్గ్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌లో కొత్తగా మరో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. రాయదుర్గ్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలందాలంటే మరో పాస్‌పోర్టు సేవా కేంద్రం అవసరమని ఆయన వివరించారు. కొత్త పాస్‌పోర్టుల కోసం ఏటా దేశవ్యాప్తంగా సగటున కోటిమందికిపైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇందులో తెలంగాణ వాటా 11 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. గతంలో పాస్‌పోర్టు కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం మూడు రోజుల్లోనే పూర్తిచేస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రం నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సికింద్రాబాద్ ఆర్పీవో స్నేహజ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





