రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే న‌గ‌ర‌ ప్రజలను ముంచిండు

– మూసీ వ‌ర‌ద‌ల పాపం రేవంత్‌రెడ్డిదే
– రెండు చెరువుల‌ను ఖాళీచేయ‌లేదు
– అందుకే ఇంత‌టి వ‌ర‌ద
– మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరుదో దోపిడీ
– కె.టి.ఆర్‌. ఆరోప‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27:  రూ.1.50 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ కిరాతక మనస్తత్వంతోనే వేలాది  ప్రజల ఇండ్లు, ఆస్తులు మూసీ వరదలో చిక్కుకున్నాయని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు శ‌నివారం బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్ కు వరద ముప్పును తగ్గించేందుకు వందేళ్ల కిందట నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ చెరువులను ఖాళీ చేయించలేదని  ఆరోపించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా ఇమ్లిబన్ బస్టాండ్‌ను వరద ముంచెత్తిందన్నారు. . కొడంగల్‌ లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు.  రాష్ట్రానికి సిఎం రేవంత్ అయినా కొడంగల్ కు మాత్రం ఆయన సోదరుడు తిరుపతి రెడ్డే ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కనీసం కౌన్సిలర్ కూడా కాని తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి దండాలు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకొని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చ‌రించారురు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో చెబుతూ తాము ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను తయారు చేశామన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రచారం కోసం ఇంటింటికీ వచ్చే కాంగ్రెస్ నేతలకు ఈ కార్డును చూపించి బాకీ కట్టిన తరువాతే ఓటు అడగాలని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతో 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి  పథకాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. అదే సమయంలో కమీషన్ల కోసం రూ.4500 కోట్లతో కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టారని విమర్శించారు. అల్మట్టి ఎత్తు పెంచితే జూరాల ప్రాజెక్టు కు చుక్క నీళ్లు కూడా రావన్న కేటీఆర్, కేవలం కమిషన్ల కోసమే ఈ పనులను మెగా కృష్ణారెడ్డికి, బాంబులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పజెప్పారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి దోపిడీ కోర్టుకు అర్థమయి, ఆ పనులపై స్టే ఇచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *