పేదల ఆకలి తీర్చే రేషన్‌ డీలర్లకే కష్టాలు

– కమీషన్‌ చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితి
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ల‌క్ష్యంపై హరీష్‌రావు ధ్వజం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నెలలతరబడి కమీషన్‌ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తూ వారి ఆకలి తీరుస్తున్న రేషన ్‌డీలర్లకు కాంగ్రెస్‌, బిజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. రేషన్‌ డీలర్లు హరీష్‌రావును ఆయన నివాసంలో మంగళవారం కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ రేషన్‌ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్‌ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమని అన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్‌ డీలర్లకు రూ.5వేల గౌరవ వేతనంతోపాటు కమీషన్‌ పెంపు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ దాని గురించి అతీగతీ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్దపు హామీలతో నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రేషన్‌ డీలర్లను సచివాలయానికి ఆహ్వానించి వారి సమస్యలు విని పరిష్కరించామని, మెట్రిక్‌ టన్నుకు ఇచ్చే కమీషన్‌ను రూ.900 నుంచి రూ.1400 కు పెంచామని చెప్పారు. ప్రభుత్వంపై రూ.139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్‌ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని 17వేల మందికిపైగా ఉన్న రేషన్‌ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపినామన్నారు. కమీషన్‌ చెల్లించడమే కాదు, కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన వందమంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌ మంజూరు చేశామని కూడా వివరించారు. రేషన్‌ డీలర్షిప్‌ వయో పరిమితిని 40 నుంచి 50ఏళ్లకు పెంచామన్నారు. ఆరు నెలలుగా పెండిరగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్‌, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్‌ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ.5వేల గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *