Rare honor: మంత్రి శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం

– ‘ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐలో చోటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు(D.Sreddharbabu) అరుదైన గౌరవం(rare honor) దక్కింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ (Analitics india magazine) తాజాగా ప్రకటించిన ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ-2025 జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, పీయూష్‌ గోయల్‌, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఇండియా ఏఐ మిషన్‌ సలహాదారు ఆకృత్‌ వైష్‌, ఇండియా ఏఐ మిషన్‌ సీఈవో, ఎన్‌ఐసీ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌, ఎన్‌ పీసీఐ సీఈవో దిలీప్‌ అస్బే, నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌, నాస్కామ్‌ మాజీ అధ్యక్షుబు దేబజాని ఘోష్‌ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఏఐ రంగంలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ నిర్వాహకులు ప్రకటించారు. బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్‌ రోడ్‌ మ్యాప్‌ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారని, గుడ్‌ గవర్నెన్స్‌, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించేందుకు చొరవ చూపారని మంత్రి శ్రీధర్‌బాబును కొనియాడారు. గ్లోబల్‌ ఏఐ సమ్మిట్‌ నిర్వహణలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేలా 2025-26లో 100 గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్‌ అండ్‌ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటుకానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు అని నిర్వాహకులు ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్‌ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు : శ్రీధర్‌బాబు

ఇది తన ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు.. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న తమ ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే తనకు ఈ జాబితాలో చోటు దక్కిందిదన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబ్‌గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడిరచి సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *