ఏదులాపురంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు

– పాల్గొన్న‌ 825 మంది ఆడపడుచులు
– సృజనాత్మకతకు అద్దం పట్టిన రంగవల్లులు
– వృద్ధురాలి ఉత్సాహానికి మంత్రి ఫిదా
– ప్రత్యేక నగదు పురస్కారం
– బహుమతులంద‌జేసిన మంత్రి పొంగులేటి దంపతులు, ఎంపీ రఘురాం రెడ్డి

ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వెలుగులు ముందే వచ్చాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు కనులవిందుగా సాగాయి. మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సాయి ప్రభాత్ నగర్‌లో జరిగిన ఈ మెగా పోటీలకు మహిళా లోకం పోటెత్తింది. ఏకంగా 825 మంది మహిళలు రంగురంగుల రంగవల్లులతో ఏదులాపురం వీధులను ఇంద్రధనుస్సులా మార్చేశారు. మహిళలు కేవలం ముగ్గులు వేయడమే కాకుండా, వాటిలో సామాజిక అంశాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చొప్పించి తమ సృజనాత్మకతను చాటారు. రైతన్నకు భరోసా, మహిళా రక్షణ వంటి అంశాలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలో ప్రతిభ కనబరిచిన విజేతలకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయన సతీమణి పొంగులేటి  మాధురి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు.  ప్రథమ బహుమతి: లక్ష్మిప్రసన్న (రూ. 30,000), ద్వితీయ బహుమతి: ఎన్. విజయ (రూ. 25,000), తృతీయ బహుమతి: కె. నిర్మల (రూ. 20,000), నాల్గవ, ఐదవ: వి. నాగమణి (15వేలు), వి. రమాదేవి (10వేలు), 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన వారికి తలా రూ. 5,000 అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… “మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీలు మన సంస్కృతికి అద్దం పడుతున్నాయి. 80 ఏళ్లు దాటిన వృద్ధురాలు కూడా ఈ వయస్సులో పోటీలో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఆమెకు ప్రత్యేకంగా రూ. 2 వేలు బహుమతిగా ఇచ్చారు. 11 నుంచి 20 స్థానాల వారికి రూ. 2వేలు చొప్పున, 21 నుంచి 30 స్థానాల వారికి ప్రత్యేక బహుమతులు అందజేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *