– వరంగల్ కిట్స్‌లో గ్రంథపాలకుల దినోత్సవం
– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కోమల్ రెడ్డి
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్సార్ రంగనాథన్ స్ఫూర్తిని కొనసాగించాలని కిట్స్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. కళాశాల గ్రంథాలయం ఆధ్వర్యంలో ఎస్‌ఆర్ రంగనాథన్ 133వ జయంతి ఉత్సవాలలో భాగంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. రంగనాథన్‌ను ఆదర్శంగా తీసుకొని గ్రంథాలయ సిబ్బంది చదువరులకు కావలసిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని, గ్రంథాలయాన్ని ఆధునికీకరించాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కళాశాలతోపాటు గ్రంథపాలకుల పాత్ర ప్రధానమని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు, కిట్స్‌డబ్ల్యు చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కిట్స్‌డబ్ల్యు కోశాధికారి పి.నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిట్స్ అడిషనల్ సెక్రెటరీ వి.సతీష్ కుమార్ జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు కేంద్ర గ్రంథాలయం విభాగాన్ని అభినందించారు. ఈ సందర్భంగా డీన్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లైబ్రరీ అనేది పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అభ్యాస దేవాలయమని చెప్పారు. విద్యార్థులలో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడంలో, పఠన ప్రేమను పెంపొందించడంలో లైబ్రేరియన్లు పోషించే కీలక పాత్రను వివరించారు. కళాశాల గ్రంథ పాలకురాలు, కళాశాల గ్రంథాలయ కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ బి.రమాదేవి మాట్లాడుతూ రంగనాథన్ గ్రంథాలయాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు గ్రంథాలయంలో తీర్చిదిద్దబడుతుందని తెలిపారు. కళాశాల గ్రంథ పాలకుడు డాక్టర్ కె.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి రంగనాథన్ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు వల్లనే ఈరోజును రంగనాథన్ గౌరవార్థం జాతీయ గ్రంథపాలకుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి, కెఐటిఎస్‌డబ్ల్యు, ప్రొఫెసర్ వి.రాజగోపాల్, ఐడిసి కోఆర్డినేటర్ యుఎస్ బాల్‌రాజ్, వివిధ విభాగాధిపతులు ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బ, ప్రొఫెసర్ ఎం.శ్రీకాంత్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ, పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, డాక్టర్.ఎం.నిరంజన్, డాక్టర్ ఎం.అరుణ్, పి.సుమలత, టి.రాజు, లైబ్రరీ సిబ్బంది, పలువురు అధ్యాపకులు, డీన్లు, వివిధ విభాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.




