రామయ్య పెళ్లి కొడుకాయెనే..

భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం
˜మిథిలా మైదానంలో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు
˜రేపు మహా పట్టాభిషేకం.. భారీగా తరలివస్తున్న భక్తజనం

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : భద్రాద్రికి రాములోరి పెళ్లి  కళ వొచ్చేసింది. కల్యాణోత్సవం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక మిథిలా స్టేడియంలోని మండపాన్ని పూలతో అలంకరించారు. రామాలయం రంగు రంగు విద్యుత్‌దీపాలతో అలంకరించారు. ప్రధాన రహదారులపై  స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్షన్నర మంది భక్తులు వొస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.నేడు జరగనున్న కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. రేపు జరిగే పట్టాభిషేకానికి గవర్నర్‌ జిష్ణురేవ్‌ వర్మ దంపతులు హాజరుకానున్నారు.
వదువు : సీతాదేవి
వరుడు : శ్రీసీతారామచంద్రస్వామి
వేదిక : భద్రచలంలోని మిథిలాస్టేడియం
సమయం : ఆదివారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు
సుముహూర్తం: మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం

కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆదివారం నాడు భద్రాచలంలో అత్యంత వైభవంగా జరగనున్న సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేలాదిగా భద్రాద్రికి తరలివస్తున్నారు. కల్యాణానికి మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు వొస్తారని అంచనా వేసి అందుకణుగుణంగా ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రికే వివిద ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. స్టేడియంలో కల్యాణాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లు 35 వేల మంది మాత్రమే అవకాశం ఉంటుంది. మిగిలిన వారు స్టేడియం బయట ఉంటే చూడాల్సి వొస్తుంది. వారికోసం పెద్ద ఎల్‌ఈడిలను ఏర్పాటు చేశారు. భక్తులకు అందరికీ తలంబ్రాలు ఉచితంగా అందజేసేందుకు 80 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈసారి 300 క్వింటాళ్లకు పైగా తలంబ్రాలు ఆలయ అధికారులు సిద్దం చేశారు. 26 కౌంటర్ల ద్వారా 3 లక్ష్లల లడ్డూ ప్రసాదాలను విక్రయించేందుకు  ఏర్పాట్లు  చేశారు.

వేసవి నేపథ్యంలో పట్ల ప్రత్యేక దృష్టి…
ఎండలు మండుతుండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రత్యేక దృష్టితో మిథిలా స్టేడియంలో భక్తులపై నీటి తుంపర్లు పడే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే చల్లటి పొగమంచును కూడా భక్తులపై పంపిచే యత్నం చేస్తున్నారు. మంచినీరు, మజ్జిగ  అందించనున్నారు. బయట కూడా అనేక మంది దాతలు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర, అన్నదానం, పానకం  వంటివి పంపిణీ చేయనున్నారు.

ముత్యాల తలంబ్రాలతో సిఎం రాక
ప్రతి ఒక్కరు శ్రీరాముడు సీతమ్మ కల్యాణ గడియల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామాలయం ఆవరణ కల్యాణం జరిగే మిథిలా స్డేడియం విద్యుత్‌ దీపాల కాంతితో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. శిల్పకళా శోభితమైన కల్యాణ మండపాన్ని కమణీయంగా అలంకరించారు. సీతారాముల కల్యాణం చ్కెత్ర శుద్ద నవమి రోజ్కెన ఆదివారం  అభిజిత్‌ లగ్నంలో మద్యాహ్నం 12 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కల్యాణానికి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్నారు.
ఆదివారం నాడు  హెలీకాప్టర్‌ ద్వారా భద్రాచలం చేరుకుంటారు. ఏర్పాట్లను స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి నివాసరెడ్డి  పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇక పందిళ్లను చాందినీ వస్త్రాలు, చలువ తాటాకు పందిళ్లు తోరణాలతో అందంగా అలంకరించారు. మండపం ఆవరణ సెక్టార్లుగా విభజించారు. పట్టణంలో పలు చోట్ల షామియానాలు, చలవ పందిళ్లు వేసి అప్రాంతాలలో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. కాఫీ, టిఫిన్‌, భోజనం తక్కువ ధరలకే లభించే విధంగా హోటల్‌ యాజమాన్యాలకు  అధికారులు సూచించారు. వైద్య శిబిరాలను, 108 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆర్‌టిసి అదనపు బస్సులను  ఏర్పాటు చేసింది.

రేపు మహా పట్టాభిషేకం
మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే సోమవారం స్వామివారికి మహా పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. మహా పట్టాభిషేకానికి కూడా దేవస్థానం అధికారులు వివిఐపి సెక్టారుకు  మిగిలిన సెక్టార్లకు భక్తులను ఉచితంగానే అనుమతిస్తారు. ఈ మహోత్సవానికి గవర్నర్‌  జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేస్తారు.

పోలీసుల వలయంలో భద్రాద్రి
శ్రీరామనవమి, పట్టాభిషేకానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు భద్రాచలం రానున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్‌  జిష్ణుదేవ్‌ వర్మ సైతం వేడుకల్లో పాల్గొననుండడంతో పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు రాష్ట్ర సరిహద్దు డివిజన్‌ కావడంతో మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రాచలం పట్టణాన్ని చక్రబంధం చేసినట్లయింది. ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 1800 మందికి పైగా పోలీసులు సీతారాముల కల్యాణం, ముఖ్యమంత్రి, గవర్నర్‌ బందోబస్తు కోసం తరలివచ్చారు. హెలిప్యాడ్‌ మొదలు సీతారాముల కల్యాణం మీదుగా మిథిలా స్టేడియం వరకు సింగిల్‌ వే చేశారు. ఆ దారి మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాలపై డేగ కన్ను వేశారు. ప్రతి వాహనాన్ని భక్తుల్ని తనిఖీలు చేశాకే పట్టణంలోకి అనుమతి ఇస్తున్నారు. హెలిక్యాప్టర్‌ కూడా పట్టణంపై చక్కర్లు కొట్టింది. స్టేడియంలో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి వెంట ఎవ్వరినీ ప్రవేశమార్గం నుంచి అనుమతించకూడదనే నిబంధనను ఈసారి కూడా కొనసాగించనున్నారు.

మావోయిస్టులు భక్తుల రూపంలో వొచ్చే అవకాశం ఉన్నందున క్యాట్‌పార్టీలు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు వారిలో కలిసిపోయి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గోదావరి బ్రిడ్జి, చర్ల, కూనవరం రోడ్ల నుంచి పట్టణంలోకి ప్రవేశించే అన్ని మార్గాలపైనా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఒకరు అడిషనల్‌ ఎస్పీ, 16 మంది డిఎస్పీలు, 66 మంది సిఐలు, 185 మంది ఎస్సైలు, 304 మంది ఎఎస్సైలు,  కానిస్టేబుల్స్‌, 555 మంది మహిళా కానిస్టేబుల్స్‌, 208 మంది హోంగార్డులు 401 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. వీరు కాకుండా 10 రోప్‌ పార్టీలు, 15 స్పెషల్‌ పార్టీలు, కూబింగ్‌ పార్టీలు బందోబస్తులో ఉంటున్నారు. హెలీప్యాడ్‌, దేవాలయం, కళ్యాణ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

స్వామి వారి శిరస్సుపై నుంచి జాలువారిన ఆ ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం.. ముత్యం అంటేనే అతి పవిత్రమైనది. అందునా….సాక్ష్యాత్తు దేవదేవుని శిరస్సులపై నుంచి జాలువారిన ముత్యాలంటే మరింత పవిత్రమైనవి. అందుకే  సీతారాముల పెళ్లిలో వాడిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను సొంతం చేసుకునేందుకు భక్తులు మక్కువ చూపుతారు. తానీషా ప్రభువుల కాలం నుంచి సీతారాముల పెళ్లి వేడుకకు ప్రభుత్వం తరుపు నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టుపీతాంబరాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే ఆనవాయతీ నేటికి కూడా శుభప్రదంగా కొనసాగడం ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏటా ముఖ్యమంత్రి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొస్తుంటారు.

సీతమ్మకు చేయిస్తిని..
పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అను భక్తరామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతు పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడ్కెన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు, ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరాముకి అలంకరిస్తారు.
చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అ్న రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ పతకాన్ని శ్రీరామనవమి నాడు, అలాగే ప్రత్యేకమైన ఉత్సవాల్లో సీతమ్మ తల్లికి అలంకరిస్తారు.

మంగళసూత్రం : మూడు మాంగల్యాలు గల మంగళ సూత్రాన్ని రామదాసు చేయించారు. ఒకటి దశరథ మహారాజు గారి తరపున, రెండు జనక మహారాజు తరపున, మూడు భక్తరామదాసే కన్యాదాతగా తమ తరపున అమ్మవారికి సమర్పించినది. ఈ మాంగల్యముతోనే శ్రీరామ నవమినాడు కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
శ్రీరామ మాడ : రామదాసు చెర నుంచి విడిపించడానికి రామలక్ష్మణులిద్దరూ గోల్కండ నవాబ్కెన తానీషా వద్దకు రామోజీ, లక్ష్మోజీ అనే సిపాయిల రూపాలతో వెళ్లి, ఆలయం నిర్మించడానికై ఖర్చు చేసిన 6 లక్షల వెండి నాణాలకు బదులుగా 6 లక్షల బంగారు నాణాలు చెల్లించారు. ఆ నాణాలపై ఒక వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరోవైపు దాసాంజనేయస్వామి రూపు ఉంటాయి. ఆ నాణానికే రామ మాడ అనే పేరు. బంగారు గొలుసుతో కలిసిన ఆ రామమాడను శ్రీరామనవమి, ఇతర ప్రత్యేక ఉత్సవాల్లో లక్ష్మణస్వామికి అలంకరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *