– తుది దశకు చేరుకున్న పనులు
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్ కాలనీని ఆయన బుధవారం పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాలనీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. అవసరమైతే అదనపు సమయం పనిచేసి అయినా ఈ వారంలో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఏపీలో గృహ నిర్మాణ శాU మంత్రిగా తాను ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాకే తుది దశకు చేరుకుందన్నారు. 2014లో బీఆరఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి పనులు ముమ్మరంగా సాగుతున్నా వారు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. అదృష్టవశాత్తు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో (భూసేకరణ ఖర్చులు మినహా, ఎకరానికి రూ.కోటికి పైగా చెల్లింపు) ఈ కాలనీ నిర్మించారు. మొత్తం 2,160 ఆధునిక సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు నిర్మించి అంతే సంఖ్యలో కుటుంబాలకు వసతి కల్పించనున్నారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని సుసంపన్నమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు, హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు, సమీప గ్రామాల నివాసితుల కోసం ఉద్దేశించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరపడంపై మంత్రి దృష్టి పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారి పేరు ఈ జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. మొదటి దశలో వెయ్యిమంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని, అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. కాలనీ, పరిసర ప్రాంతాలను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించేందుకు ప్రత్యేక సభా వేదికను సిద్ధం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




