రామప్ప ఆలయ కమిటీ ఏర్పాటెప్పుడో?

– కమిటీ లేకపోవడంతో మరుగున పడిన అభివృద్ధి
– ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బంది
– ఆలస్యంగా విడుదలైన పాలకమండలి నోటిఫికేషన్‌
– చైర్మన్‌ రేస్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు, ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌

వెంకటాపూర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ఆలయ కమిటీ లేకపోవడంతో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప రుద్రేశ్వరాలయం అభివృద్ధికి పాటుపడేవారే కరవయ్యారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయకపోవడంపై ఆలయ భవిష్యత్తుపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో రామప్ప ఆలయ ట్రస్ట్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసేది. స్థానికులకు చైర్మన్‌తోపాటు డైరెక్టర్లుగా నామినేట్‌ పదవులు దక్కడంతో వారు ఆలయ అభివృద్ధికి పాటుపడేవారు. మహాశివరాత్రి ఉత్సవాలతోపాటు మేడారం జాతర సందర్భంగా రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. రామప్ప ఆలయంలో కొబ్బరికాయల, లడ్డు, పులిహోర, తదితర వేలం పాటలు, ఆలయ భూములకు కౌలు వేలం పాటలు సైతం కమిటీ ఆధ్వర్యంలోనే జరిగేవి. అలా వచ్చిన ఆదాయంతో ీ ఆలయ అభివృద్ధికి కృషిచేసేది. అయితే కొంతకాలంగా కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రుద్రేశ్వర ఆలయ అభివృద్ధితోపాటు ఆ పరిసరాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి కమిటీ పేరుతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ ప్రతి రెండేళ్లకొకసారి ఏర్పాటు చేసే ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేయకపోవడం వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం లేదని మండల ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిచోటా దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ రామప్పకు మాత్రం కమిటీని ఏర్పాటు చేయకపోవడం వెనుక అంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 15న కమిటీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ విడుదలవడంతో ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టి సారించి వెంటనే ఆలయ ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రామప్ప చైర్మన్‌ కోసం పలువురి ప్రయత్నాలుచైర్మన్‌ పదవి కోసం మండలంలోని పలువురు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్వర్‌రావుపల్లికి చెందిన ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడితోపాటు మండల కేంద్రానికి చెందిన మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చైర్మన్‌ రేస్‌లో ఉన్నట్లు తెలిసింది. అలాగే మండలానికి చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్టు సైతం కమిటీ చైర్మన్‌ కోసం పోటీపడుతున్నట్లు సమాచారం. వీరంతా కాంగ్రెస్‌ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇద్దరు కాంగ్రెస్‌ నాయకుల్లో ఒకరు ఇప్పటికే నామినేట్‌ పదవిలో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

మేడారం జాతర ముందు కమిటీని ఏర్పాటు చేయాలి

వచ్చే జనవరిలో మేడారం జాతర ఉన్నందున ఆలోపునైనా రామప్ప ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. మేడారం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులు రామప్పకు వస్తారని, భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. బోర్డు లేకపోవడంతో ఆలయంలో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్‌తోపాటు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క స్పందించి వెంటనే రామప్ప ఆలయ కమిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *