– వైభవోపేతంగా కార్యక్రమం
– పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శనివారంనాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రతి సంవత్సరం కళ్యాణం మరుసటి రోజు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అభిజిత్ లగ్నంలో కల్యాణం జరుపుకున్న వేదికపైనే శ్రీ రామచంద్రమూర్తి దశమినాడు పట్టాభిషిక్తుడవుతాడు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి పట్టాభిషేక వేడుకకు రాజ్యాధికార హోదాలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆలయంలోని భద్రుని మండపం నుంచి బాజాభజంత్రీలు, కోలాట నృత్యాలు నడుమ స్వామివారిని పల్లకిపై ఊరేగింపుగా మిథిలా ప్రాంగణంకు తీసుకొచ్చారు. శిల్పకళా శోభిత మండపంలోస్వామివారిని వేంచేయింపు చేశారు. అర్చక స్వాములు తొలుత విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం గావించారు. అనంతరం స్వామివారికి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలను ధరింపచేశారు. ఈ ఆభరణాలను అర్చక స్వాములు భక్తులకు చూపిస్తున్న సమయంలో భక్తులు తన్మయానికి లోనయ్యారు. తదుపరి శ్రీరామ పట్టాభిషేక పారాయణం గావించారు. ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, శుక్ల యజుర్వేదము, రామాయణం, విష్ణు పురాణం, భగవత్ శాస్త్ర పారాయణములను వేద పండితులు పఠించారు. అనంతరం పుష్కర నదీ జలాలతో మహాకుంభ తీర్థప్రోక్షణ చేశారు. ఈ భూమండలానికి రారాజుగా ఉండాలని ప్రోక్షణ నిర్వహించారు. స్వామివారికి హారతి ఇచ్చారు. భక్తుల చేత పలు స్తోత్రాలను పఠింపచేశారు. భక్తులపై పుణ్య నదీ జలాలు చల్లారు.
గవర్నర్ కు ఘన స్వాగతం 
శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవంలో పాల్గొనేందుకుహెలికాప్టర్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణితో భద్రాచలం వచ్చారు. సారపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గవర్నర్ భద్రాచల రామాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిల ప్రాంగణానికి చేరుకొని శ్రీరామ పట్టాభిషేకం వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ వేడుకలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనెం కృష్ణ దొర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పి రోహిత్ రాజ్, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృడుల్ శ్రేష్ట, రామాలయం ఈవో దామోదర్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రగిరి మార్ట్ ప్రారంభం
ఈ సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్‌ను గవర్నర్ శివ పతాప్ శుక్లా ప్రారంభించారు. మార్ట్‌లోని గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌లు ఆయనకు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





