– దావత్-ఎ-ఇఫ్తార్ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం
– మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి11: రంజాన్ ఇఫ్తార్ ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టి నిర్దేశించిన సమయానికి అందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 15న ఎల్‌బీ స్టేడియంలో దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శితో కలిసి మంత్రి వివిధ శాఖల అధికారులతో ఎల్‌బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తన మొదటి రంజాన్ దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమమని, దీనిని ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిపడ ఆహార సరఫరా, తగిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ చైర్మన్లు, సభ్యులు, మతపెద్దలు ఈ వేడుకలకు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు. ఇఫ్తార్ కు సుమారు పదివేల మంది పాల్గొనే అవకాశం ఉందని, ఆ దిశగా ఏర్పాట్లు ఉండాలని, ముఖ్యంగా ప్రొటోకాల్ తప్పక పాటించాలని సూచించారు. గత క్రిస్మస్ డిన్నర్ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో వివిధ శాఖలు సమన్వయంతో చేసిన సమర్థవంతమైన ఏర్పాట్లకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, అదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్ సౌకర్యం, ట్రాఫిక్ మళ్లింపు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ స్టేజి, గ్యాలరీలు, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వచ్చేవారికి ఎక్కడా ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నం కాకుండా సరిపడ ఆహార కౌంటర్లు, తగిన సంఖ్యలో సర్వర్లు, త్రాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియం మొత్తం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా జిహెచ్‌ఎంసి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతోపాటు వైద్యులు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక శాఖ వంట, క్యాటరింగ్ ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా ఫైర్ టెండర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచార శాఖ ద్వారా ఎల్‌ఈడి స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుతోపాటు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ప్రొఫెసర్ ఎస్.ఏ. షుకూర్, అదనపు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఖైరతాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శిల్పావల్లి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) జితేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జి.వి.నారాయణరావు, సమాచార శాఖ అదనపు సంచాలకుడు జగన్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధాకృష్ణ, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాములు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్ బాబు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ, మైనార్టీ శాఖ, ఆర్ అండ్ బి, వాటర్, విద్యుత్, అగ్నిమాపక, ఉద్యాన, వైద్య , సమాచార శాఖ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.