N Ramachandra Rao | బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న మేధావులు, విద్యావంతులు

  • మోదీ పాల‌కు స‌ర్వ‌త్రా ఆమోదం
  • బీజేపీ విజ‌యాలు తెలంగాణ‌లో మొద‌లయ్యాయి
  • కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్క‌టే
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద్ర‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శన‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌. రామ‌చంద్ర‌రావు (N Ramachandra Rao) అన్నారు. శుక్ర‌వారం  ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ తమ అనుచర బృందంతో కలిసి పెద్దఎత్తున బిజెపిలో చేరిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  సామాజిక స్పృహతో సేవలందిస్తున్న వారిని మా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామ‌న్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ  సుపరిపాలన, పారదర్శక పాలన, పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రజలకు నమ్మకం పెరిగింది. అందుకే వరుసగా వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాలు సాధిస్తోంది. అదే సరళి ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైంది. ముఖ్యంగా యువత ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరుతోందని ఆయ‌న వెల్ల‌డించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ముస్లింల వ్యతిరేకులు అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు నాటకంలో భాగంగా చేసి చిల్లర రాజకీయ వ్యాఖ్యలే తప్ప మరొకటి కాదు. గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి స్వయంగా “కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్” అని బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని కూడా ప్రకటించారు. ఇది వారి రాజకీయ దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తోంద‌న్నారు.

మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో అంటకాగుతోందన్న విషయం ప్రజలకు అర్థమవడంతో, ఆ భయంతోనే రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్‌తో మాట్లాడి ఇలాంటి వ్యాఖ్యలు చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోంద‌న్నారు. అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి ఇద్దరూ దోస్తులే. ఎప్పుడూ కలిసే ఉంటారు. బయట మాత్రం నాటకాలు ఆడుతూ, అక్బరుద్దీన్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్‌కు గానీ, సీఎంకు గానీ నిజంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇద్దరి మధ్య పక్కా అండర్‌స్టాండింగ్ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌కు కొమ్ముకాస్తోంద‌న్నారు.  కాంగ్రెస్-మజ్లిస్ పార్టీల మతపరమైన రాజకీయాలు ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. ఈ కారణంగానే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ చేత ఈ వ్యాఖ్యలు చేయించారన్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం పార్టీలు కలిసి బిజెపి గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అదే వ్యూహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీని గెలవనీయొద్దన్న ఉద్దేశంతోనే ఈ డ్రామా రాజకీయాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేతిలో గడ్డపార పట్టుకుని పేద ప్రజల ఇళ్లను కూల్చుతున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా (HYDRA Hyderabad Issues)  పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో కూడా పేద ప్రజల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చారు. కానీ పాతబస్తీలో చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఓవైసీ కాలేజీని మాత్రం హైడ్రా ఎందుకు కూల్చడం లేదు? ఇది వివ‌క్ష కాక‌పోతే మ‌రేంట‌ని ప్ర‌శ్నించారు.
ఎంఐఎం-కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

రేవంతుద్దీన్, అక్బరుద్దీన్ ఇద్దరూ దోస్తులే. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ లాంటిది. ఆ నగరాన్ని కబ్జా పెట్టేందుకే ఈ రాజకీయ నాటకాలు. అందుకే హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా వుండాల‌ని కోరుతున్నాన‌న్నారు.  దిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించిన తీర్పు విషయంలో.. కేజ్రీవాల్, కవితకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్ అనేది పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే. ఇందులో సీబీఐ, అడ్వకేట్ల మధ్య తలెత్తిన సాంకేతిక అంశాల లోపాలపై కోర్టు నిర్ణయం తీసుకుంది. అంతమాత్రాన వారు అమాయకులని చెప్పలేమ‌న్నారు.  ఇది కేవలం ట్రయల్ కోర్టులో జరిగిన ఒక నిర్ణయం మాత్రమే. తదుపరి చర్యలపై సీబీఐ నిర్ణయం తీసుకోవచ్చున‌న్నారు. ఈ కేసులో వాస్తవాలు లేకపోతే సెల్‌ఫోన్లు ఎందుకు తగలబెట్టారు? కేజ్రీవాల్ పాలసీని ఎందుకు మార్చుకున్నారు? రివర్స్ పాలసీ ఎందుకు తీసుకువచ్చారు? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై మొదట 2022లొ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాతే 2024లో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయ‌ని గుర్తుచేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *