– రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం
గద్వాల, ప్రజాతంత్ర, జులై 27: గద్వాల ప్రజలతో తనకు విశేషమైన అనుబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం గద్వాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోందని, కానీ ఇక్కడి రైతులకు సాగునీటి సదుపాయం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు మోపుతోందన్నారు. యూపీఏ పాలనలో రైతులు ఎరువుల కోసం రోజులతరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక నీమ్ కోటెడ్ యూరియాను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.. తెలంగాణకు అవసరమైన 9.5 లక్షల మెట్రిక్ టన్నులకంటే 2.5 లక్షల మెట్రిక్ టన్నుఎక్కువగా 12.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం సరఫరా చేసిందని, అయినప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జేపీ నడ్డాని కలిసినప్పుడు తెలంగాణకు అవసరమైన యూరియాను కేంద్రం పంపుతున్నప్పటికీ మార్కెట్‌లో యూరియా కొరత ఎందుకు ఏర్పడిరదో దర్యాప్తు చేయాలని కోరారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళారులకనుకూలంగా వ్యవహరిస్తూ ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఈ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను రైతులు నిలదీయాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు. గద్వాల జోగులాంబ చెన్నకేశవ ఆలయం, శ్రీ లక్ష్మీనర్సింహస్వామి సన్నిధి, అహోబిల మఠంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఇతర నాయకులతో కలిసి స్వామి వార్ల ఆశీర్వాదం పొందారు.
వనపర్తిలో మీడియాతో..
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదని, ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారికి ఈ రోజు వరకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిందని, ఇప్పుడు అది ఏమైందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఇప్పుడు రాష్ట్రం అంతటా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోందని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని అన్నారు. ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా నాశనం చేయకూడదంటూ మనకు కావాల్సింది ఉడ్తా తెలంగాణ కాదు.. అభివృద్ధి చెందిన తెలంగాణ కావాలి అని రామచందర్‌రావు అన్నారు.





