– అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కవల పిల్లలు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– కరీంనగర్‌లో జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనం
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షుల, కార్యదర్శుల సమ్మేళనానికి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం బీజేపీ బలం పెరుగుతోందనడానికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ జిల్లా ఇప్పుడు బీజేపీ అడ్డాగా మారిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌లు, వార్డు మెంబర్లు అన్నింటిలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన ఈ గడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి గొప్ప నాయకులను అందించిందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని, రూ.2 వేల కోట్లతో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ జరుగుతోందని, రాష్ట్రంలో రైల్వేలు, రోడ్ల నిర్మాణాల అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ.12 లక్షల కోట్లు నిధులు ఇచ్చిందని, కానీ గత బీఆర్‌ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కేంద్రం ఏం ఇస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యురాలే బయటపెడుతున్నారని, అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు బయటపడ్డాయని చెప్పారు. అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కవలపిల్లల్లాంటివన్నారు. ఇక్కడి శాతవాహన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ క్లాసులు మూసేస్తే స్థానిక ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లా మినిస్టర్‌తో మాట్లాడి తిరిగి తరగతులు ప్రారంభింప చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఉందని, జాబ్ క్యాలెండర్ ప్రకటించినా నోటిఫికేషన్లు లేవని విమర్శించారు. యువ, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు చేశామని కాంగ్రెస్ చెబుతోంది కానీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మొహం చూపలేక పార్టీ నేతలు కాకుండా రాష్ట్ర ఇన్‌చార్జిలతో పాదయాత్ర చేయాల్సిన స్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలు వాయిదా వేయమని అడిగిందన్నారు. పల్లెపల్లెకు వెళ్లి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో అవినీతిరహిత, అభివృద్ధితో కూడిన ప్రభుత్వం కావాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీ మాత్రమేనని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జీవో 317కు వ్యతిరేకంగా పోరాడి బండి సంజయ్ జైలుకెళ్లి టీచర్లకు న్యాయం చేశారని, అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిచారని రామచందర్‌రావు చెప్పారు. తెలంగాణలో మార్పు రావాలి.. బీజేపీ అధికారంలోకి రావాలి అని పిలుపునిచ్చారు. 2028లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తదిరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




